కొరుక్కుపేట:ప్రవాస తెలుగువారి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రాఘనాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతాల్లో మృ+తి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున వెళ్లిన ఆయన చెన్నైకు రావటంతో చెన్నై పురి ట్రస్ట్ ఆహ్వానం మేరకు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. చెన్నపురి ట్రస్ట్ నిర్వాహకులు తంగుటూరి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పల్లె రఘనాథరెడ్డి పాల్గొన్నారు.
తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్యలో తెలుగు భవన్‌ను నిర్మించనున్నామని తెలిపారు. స్వచ్ఛమైన సంప్రదాయ భావాలు కలిగిన తెలుగు భవన్ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తెలుగు ప్రముఖులు, చెన్నపురి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పొన్నూరు రంగనాయకులు, ఎం.వి.నారాయణగుప్త, తంగుటూరి రామకృష్ణలు తమిళనాడులో తెలుగువారి సమస్యలు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం గ్రాంట్‌ల సమస్యలు చెన్నైలోని తెలుగు జర్నలిస్టు సమస్యలను పల్లెరఘనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన మస్తాన్‌బాబు ఉన్నత విద్యలను చదివి సత్యం కంప్యూటర్‌లో మంచి హోదాలో పని చేశారని అన్నారు. జాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు మస్తాన్‌బాబు కావటం విశేషం. దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతాల్లో ఎక్కుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఇతనికి జాతీయ నాయకులు ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు చేశామన్నారు. తెలుగు మాట్లాడేవారు 18 కోట్లమంది ఉన్నారని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం బయట గాని, విదేశాలలో గాని ఉన్న తెలుగు వారు తెలుగు భాషా సంస్కృతులపై చూపుతున్న అభిమానం అనన్యసామాన్యమైనదని అన్నారు. రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటున్న తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తెలుగు ప్రాచీన వైభవాన్ని, నైతిక విలువలను, సమాజం పట్ల అవగాహన దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఆ దిశగా తెలుగు పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని వివరించారు. తెలుగు భాషకు ఇతోధికంగా సేవలందించే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుందన్నారు. ఆ దిశగా జాతి నాయకులు ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, గురజాడ, గిడుగు, అల్లూరి సీతారామరాజు, బాపు లాంటి మహోన్నత వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి భాషా సమస్యలను పరిష్కరించే విధంగా తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లనున్నామన్నారు. పొట్టి శ్రీరాములు స్మారక మందిరానికి పెంచిన గ్రాంటును అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు నేర్పించే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. చెన్నైలోని తెలుగు జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ నిర్మాత కందేటి సత్యనారాయణ, మిర్చి వ్యాపారవేత్త జి ఆర్ రమేష్, ఇజ్రాయేల్, కె ఎల్ శ్రీనివాస్, గుర్రం చంద్రశేఖర్, పొన్నూరు రంగనాయకులు, రవిబాబు, టీడీపీ స్థానిక నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు
సహకారం అందిస్తాం
Published Sun, Apr 26 2015 2:16 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement