అదే పేరు.. అవే పోలికలు... అందుకే...
నిందితుడని అదుపులోకి తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు
విచారణ అనంతరం వదిలేసిన వైనం
బతుకు జీవుడా అంటూ గ్రామానికి చేరుకున్న బాధితుడు
గంగావతి : ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదే పేరు.. అవే పోలికలతో ఫేస్‌బుక్‌లో ఫొటో కన్పించింది. ఇంకేముంది.. నిందితుడనుకుని అరెస్ట్‌చేశారు. విచారణ అనంతరం కాదని తెలుసుకుని వదిలివేశారు. దీంతో బాధితుడు బతుకుజీవుడా అంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్లండ్ హోటల్ నిర్వహిస్తున్న సూద్ దంపతులను అదే హోటల్‌లో పనిచేసే శ్యామలరావు 2001లో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అక్కడి జిల్లా న్యాయస్థానం 2004 మే 17న శ్యామలరావుకు ఉరిశిక్ష విధించింది.
అయితే..అతను సహన సెంట్రల్ జైలు నుంచి అదే ఏడాది ఆగస్టులో తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఫేస్‌బుక్‌లో అదే పేరు, పోలికలతో ఫొటో కన్పించింది. దాని ఆధారంగా ఈ నెల 6న కర్ణాటక రాష్ట్రం గంగావతి తాలుకా విద్యానగర్‌కు వచ్చారు. శ్యామలరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. అక్కడ సుదీర్ఘ విచారణ అనంతరం శ్యామలరావు వెంట్రుకలు, ఎత్తు, తండ్రి పేరు పరిశీలించి అపరాధి కాదని నిర్ధారించారు. గురువారం ఇంటికి తిరిగి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా..విద్యానగర్‌లో స్థిరపడిన చీకట్ల శ్యామలరావుది తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం. కొన్నేళ్ల క్రితమే ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు.