'పెళ్లెప్పుడో తెలియదు' | Anushka interview with sakshi | Sakshi
Sakshi News home page

'పెళ్లెప్పుడో తెలియదు'

Published Tue, Nov 24 2015 10:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

'పెళ్లెప్పుడో తెలియదు'

'పెళ్లెప్పుడో తెలియదు'

నా వివాహమెప్పుడో నాకే తెలియదు అంటున్నారు నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాలకు చిరునామాగా మారిన నాయకి ఈమె. ఇలా అసమాన పాత్రల్ని అవలీలగా నటించేస్తున్నారు అనుష్క. తాజాగా బొద్దుగా, ముద్దుగా, సన్నగా, నాజూకుగా అవన్నీ ఒకే చిత్రంలో, ఒకే పాత్రలో ఒదిగిపోయింది. సినీ రస హృదయాలను వశపరచుకుని పరవశింపజేయడానికి రానున్నారు. అవును అనుష్క నవరసభరితంగా నటించిన ద్విభాషా చిత్రం ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్) చిత్రం అందంగా ముస్తాబై శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా అందాల భామ అనుష్కతో చిన్న భేటీ.
 
ప్ర: ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు?
జ: ఫలానా కథా చిత్రాల్లో నటించాలని అనుకోవడం కంటే మంచి కథా చిత్రాల్లో నేనుండాలని ఆశిస్తాను. బాహుబలి, ఇంజి ఇడుప్పళగి లాంటి చిత్రాలు అలా అమరినవే. ఇంజి ఇడుప్పళగి చిత్రం అమ్మాయిలందరికి నచ్చుతుంది. అలాంటి పాత్రను నేనీ చిత్రంలో నటించాను.
 
ప్ర: సాధారణంగా ఇప్పటి వరకూ నటులే పాత్రల కోసం బరువు తగ్గడం,పెరగడం లాంటివి చేస్తున్నారు. నటిగా మీరు ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్రగా మారడానికి బరువు పెరగడం గురించి?
జ: ఈ చిత్రం కోసం తొలుత ఫొటో షూట్ చేసినప్పుడు పాత్రకు గెటప్ సరిగా సెట్ కాలేదు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో సరిచేద్దాం అన్నారు. మరి కొందరు అధిక మేకప్‌తో ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. బరువు పెంచడంలోనూ ఆపదే అన్నారు. అలాంటివి నాకు సంతృప్తినివ్వలేదు. చిత్ర కథా పాత్రకు తగ్గట్టు బరువు పెరగడమే సరైన చర్య అని నేను భావించాను. అలాంటి నిర్ణయం తీసుకున్న తరువాత మూడు నెలల్లో 17 కిలోల బరువు పెరిగాను.
 
ప్ర: బరువు పెరగడం కష్టమా? తగ్గడం కష్టమా?
జ: నిజం చెప్పాలంటే రెండూ కష్టమే
 
ప్ర: ఇంజి ఇడుప్పళగి చిత్రంలో సందేశం లాటిదేమయినా ఉంటుందా?
జ: ప్రత్యేకంగా సందేశం అంటూ ఏమీ ఉండదు. అందం అనేది సన్నం లావులను బట్టి ఉండదు. మంచి మనసున్న వారందరూ అందమైన వారేనని చెప్పే చిత్రం ఇంజి ఇడుప్పళగి.
 
ప్ర: నటి కాకుంటే ఏమైఉండేవారు?
జ: నేను 17వ ఏట నుంచే యోగా చేస్తున్నాను. కాబట్టి నటి కాకుంటే యోగా టీచర్ అయ్యేదాన్ని.
 
ప్ర: విశాల్, సూర్య, ఆర్య, ప్రభాస్‌లలో మీకు సరైన జోడీ ఎవరనుకుంటున్నారు?
జ: మీరు చెప్పిన వారందరూ నాకు మంచి స్నేహితులే. విక్రమ్, సూర్యలు సీనియర్ నటులు. యూనిట్‌లోని వారినందర్నీ గౌరవించే నటుడు సూర్య. నాకు ఏదైనా సందేహం కలిగినప్పుడు విక్రమ్‌తో చర్చిస్తుంటాను.
 
ప్ర: సినిమాలో అధికంగా నేర్చుకుంది ఎవరి నుంచి?
జ: రజనీకాంత్ నుంచీ చాలా నేర్చుకున్నాను. ఆయన నటన, జీవితం నాకు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్‌స్టార్ అయిన ఆయన నిరాడంబరత చాలా నచ్చింది. అలాగే నటి మనోరమ. అరుంధతి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటనపై ఆమె అంకితభావం నన్ను విస్మయపరచింది.
 
ప్ర: తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఏ భాషా అభిమానులంటే మీకు ఇష్టం?

జ: ఏ భాషా కథా చిత్రం అయినా నచ్చితేనే చేస్తాను. నన్ను గెలిపించేది అభిమానులే. వాళ్ల విషయంలో తారతమ్యాలు లేవు.
 
ప్ర: చిత్ర రంగప్రవేశం చేసి దశాబ్దం దాటింది. ఏదైనా మంచి పాత్ర పోషించాలనే కోరిక ఉందా?
జ: బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించాలని అందరూ కోరుకుంటారు. అలాంటి మంచి పాత్ర ఏదైనా ఉంటే చెప్పండి. సినిమా అనేది మాయాజాల లోకం. అసలు నేనీ రంగంలోకి వస్తాననే ఊహించలేదు. అంతా దైవేచ్ఛ.
 
ప్ర: కథానాయికల మధ్య ఇప్పుడు పోటీ అధికం అంటున్నారే?
జ: అలాంటి పోటీ అవసరమే. అప్పుడే ది బెస్ట్ ఔట్‌పుట్‌ను ఇవ్వగలం. అయితే నెంబర్‌ఒన్ పోటీపై నాకు నమ్మకం లేదు. దాని వల్ల అదనంగా లాభం ఉంటుందని కూడా అనుకోను. మంచి కథాపాత్రల్లో నటిస్తే చాలు. నాకు వరుసగా మంచి చిత్రాలు అమరడం సంతోషంగా ఉంది.
 
ప్ర: మీరు నటించిన చిత్రాల్లో ఉత్తమ చిత్రాలుగా మారు చెప్పేది?
జ: మొదటి వరుసలో నాగార్జునతో నటించిన సూపర్ చిత్రం. ఆ తరువాత వేదం, దైవతిరుమగళ్, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి ఇలా చెప్పుకుంటూపోవచ్చు.
 
ప్ర: అందరూ అడిగే అరిగిన ప్రశ్నే. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: ఏడాది పొడుగునా నటులతోనో, వ్యాపారవేత్తలతోనో నన్ను కలుపుతు గ్యాసిప్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక నేను ప్రేమ వివాహమా? తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటానా? ... అసలు అది ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. అయితే పెళ్లి ఎప్పుడు జరిగినా రహస్యంగా మాత్రం జరగదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement