జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన నాలుగు బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. విజయవాడలో మంగళవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. కర్నూలులో ఇండ్రస్టీయల్ హబ్ కోసం ఏపీఐఐసీకి 7 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్కో, ఏపీఐఐసీకి కలిపి సుమారు 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది.
ఎలక్ట్రానిక్ పాలసీ సవరణ, కార్మిక సంస్కరణలు, కాకినాడలో గెయిల్ గ్యాస్ స్టోరేజ్ ఫెసిలిటీని పెంచే ప్రతిపాదనలకు కేబినేట్ అంగీకరించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే.
కేబినేట్ ఆమోదించిన బిల్లుల వివరాలు
► జీఎస్టీ బిల్లు
► ఎన్జీ రంగా వర్శిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బిల్లు
► రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించే బిల్లు
► కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోని వ్యాట్ సవరణ బిల్లు.