వారిది అన్యోన్య దాంపత్యం.. భర్తే లోకంగా ఆమె, భార్యే ప్రపంచంగా ఆయన బతికారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా తనయ పుట్టింది. ప్రజాసేవకు అవకాశం కలసిరావడంతో ఆయన ప్రోత్సహించారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికై తమ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించేవారు. అయితే ఆ దంపతులపై విధి కన్నుకుట్టింది. వారం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకుని ఇంటికి బయలుదేరారు. మరి కాసేపటిలో ఇంటికి చేరుకుంటామనగా జరిగిన ప్రమాదంలో ఆమెను మృత్యువు కబళించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
కృష్ణగిరి/ప్యాపిలి : వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ-1 సభ్యురాలు బోరెడ్డి శ్రీలత(26) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ వద్ద వారం కిందట జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి భర్తను డిశ్చార్జ్ చేసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు భర్తతో కలసి ఆమె ప్యాపిలిలో ఆటో ఎక్కారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో మార్గమధ్యంలోని బోమ్మిరెడ్డిపల్లె సమీపానికి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. సంఘటనలో శ్రీలత అక్కడికక్కడే మరణించారు. అదే ఆటోలోని భర్త గోపీనాథ్‌రెడ్డి, బావ రఘునాథరెడ్డి గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న వె ల్దుర్తి ఎస్‌ఐ నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
చివరి చూపు కోసం..
తమ ప్రజాప్రతినిధి రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడినట్లు తెలియగానే ప్యాపిలి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. డోన్ ప్రభుత్వస్పాత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీలత భౌతికకాయాన్ని ప్యాపిలికి తీసుకురాగానే ఆమెను కడసారి చూసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్యాపిలి సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే రాజారెడ్డి పీఓ అంకిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా నారాయణమూర్తి, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బషీర్, సురేంద్ర, ఎస్కే వలి, రమణ తదితరులు శ్రీలతకు నివాళులర్పించారు.
వైఎస్సార్ సీపీ అభిమానిగా..
ప్యాపిలికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోరెడ్డి శ్రీరామిరెడ్డి కుమారుడు గోపీనాథరెడ్డితో కర్ణాటకలోని బళ్లారి సమీపంలో గల కొర్లగొందికి చెందిన జ్యోతి, గోవిందరెడ్డి దంపతుల కుమార్తె శ్రీలత వివాహం ఏడేళ్ల కిందట అయింది. వారికి తనయ అనే కుమార్తె పుట్టింది. వారి కుటుంబం మొత్తం వైఎస్సార్ సీపీ అభిమానులే. ఆ అభిమానమే శ్రీలతను గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. ఆమె ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఎంపీపీ రేసులో ఉన్న ఆమెకు, రాజకీయ పరిస్థితులు అనుకూలించలేకపోయాయి.
తనయను చూసి తల్లడిల్లి..
రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీలతకు రెండేళ్ల కుమార్తె తనయ ఉంది. ఆమెను తాత బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఎత్తుకుని బిగ్గరగా ఏడ్వడం అందరినీ కలచివేసింది. ఇక తన తల్లి రాదని తెలియని ఆ చిన్నారి బిత్తర చూపులు చూస్తుండగా, ‘కన్నా.. మీ అమ్మ ఇక రాదమ్మా’ అంటూ తాత ఆ పసి కూనను గుండెలకు హత్తుకోవడం అక్కడికి వచ్చిన వారి హృదయాలను బరువెక్కించింది.
లతా.. ఒక్కసారి పలకవా..
తన కళ్లెదుటే భార్య రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలొదలడం చూసి శ్రీలత భర్త గోపీనాథరెడ్డి రోదించిన తీరు పిండేసింది. విగతజీవిగా మారిన భార్యను చూసి ఆయన ‘లతా.. ఒక్కసారి మాట్లాడవా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే.. ఒక్కదానివే ఎలా వెళ్లిపోయావురా.. ఇక మన బిడ్డ తనయకు దిక్కెవర్రా... ఆ బిడ్డ అమ్మేదని అడిగితే.. నేనేమని చెప్పగలనురా... అంటూ గోపీనాథరెడ్డి పిచ్చివాడిలా రోదించడం ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది. అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
తెగిన అనుబంధం
Published Fri, Feb 20 2015 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement
Advertisement