
అభిమానుల సంతోషాన్నే కోరుకుంటా
అందం చూడవయా ఆనందించవయా అన్నారో కవి. అందానికి అంత ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పాలంటే స్త్రీలకు అందం ఒక ఆయుధం అనవచ్చు. సినీ రంగంలో అలాంటి అందాలతో చాలామంది నెగ్గుకొస్తున్నారు. అలాంటి వారిలో నటి హన్సిక ఒకరు. అయితే ఆమెలో అందం, అభినయం పోటీపడతాయిలెండి.
అయినా హన్సిక అందానికి ప్రాముఖ్యతనిస్తానంటున్నారు. ఆమె నుంచి అభిమానులు ఎక్కువ కోరుకునేది అదేనట. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ తెలుపుతూ అందానికి మెరుగు పరచుకోవడం ఒక కళ అన్నారు. అలాంటి కళ తనలో ఉండడం గర్వంగా భావిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే తన ఏడుపు నటన తన అభిమానులకు నచ్చదన్నారు. తన అందమైన జాలీ నటననే వారు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే తన అందాన్ని మెరుగుపరచుకుంటున్నానని చెప్పారు.
తన అందాన్ని అభిమానులు పొగుడుతుంటే మనసు సంతోషంతో పరవశం చెందుతుందన్నారు. తాను తన అభిమానులు సంతోషాన్నే కోరుకుంటానని చెప్పారు. చిన్నతనం నుంచే కుటుంబ సభ్యులు తనను మహారాణిగా చూసుకున్నారని షూటింగ్‌లకు వెళ్లినా అలాంటి గౌరవమే లభించడం తన అదృష్టం అన్నారు. హన్సిక ప్రస్తుతం పులి చిత్రంలో యువరాణిగా నటిస్తున్నారన్నది గమనార్హం.