లంక సేనల వీరంగం
Published Wed, Feb 5 2014 12:06 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:భారత్ - శ్రీలంకల మధ్యనున్న కచ్చదీవుల ప్రాంతంలోకి చొరబడితే చెరలోకి నెట్టకతప్పదని శ్రీలంక గస్తీదళాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. పొరపాటునో, గ్రహపాటులో అటువైపుగా వెళ్లినవారిని శ్రీలంక దళాలు పట్టుకుని చెరలో పెట్టి వేధించడం పరిపాటిగా మారింది. రామేశ్వరం, నాగపట్నం ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం కచ్చదీవులు, నెడుందీవుల మధ్యన వారు చేపలను వేటాడుతుండగా శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు వారిని చుట్టుముట్టాయి. వారిని చూడగానే భయంతో కొందరు మత్స్యకారుల తమ మరబోట్లతో రామేశ్వరంవైపు వేగంగా కదలగా 36 మంది మాత్రం పట్టుపడిపోయారు. వారిని చితకబాది శ్రీలంక జైలుకు తరలించారు.
చర్చల విఘాతానికే:సీఎం జయ ఆరోపణ
తమిళ మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై భారత్-శ్రీలంకల మధ్య సామరస్యపూరక ధోరణిలో చర్చలు సాగుతుండగా, ఈ చర్చలకు విఘాతం కలిగించేలా శ్రీలంక కుట్రపన్నుతోందని సీఎం జయలలిత ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మంగళవారం ఆమె లేఖ రాశారు. శ్రీలంక దుందుడుకు వైఖరితో జాలర్ల కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోతున్నాయని ఆమె అన్నారు. తమిళ జాలర్లను వేధింపులకు గురిచేయడం, లేదా జైళ్లలోకి నెట్టడం శ్రీలంకకు పరిపాటిగా మారిందని ఆమె పేర్కొన్నారు. శ్రీలంక ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తాము చేసిన ఆనేక ప్రయత్నాలతో ఎట్టకేలకూ ముగింపు పలికేందుకు చర్చలు ప్రారంభ మయ్యూయని సంతోషిస్తున్న తరుణంలో మళ్లీ దాడులకు పూనుకోవడం ఉద్దేశపూర్వక చర్చగా ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని తమిళ మత్స్యకారులను, వారి పడవలను శ్రీలంక నుంచి విడిపించాలని ఆమె కోరారు.
Advertisement