పాఠ్యాంశంగా ‘అరుణ’ జీవితం..?
సాక్షి, ముంబై: 42 ఏళ్లపాటు కోమాలో ఉండి ఇటీవలే మృతి చెందిన కేఈఎం ఆస్పత్రి మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగు దశాబ్దాలపాటు మృత్యువుతో పోరాటం, కేఈఎం ఆసుపత్రి నర్సుల నిస్వార్థ సేవ తదితర విషయాలను నేటి తరానికి ఆదర్శంగా చూపించేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోకున్నా ఇందుకు సంబంధించిన ప్రయత్నాలైతే జరగుతున్నాయి. 2015-16 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వెలువడటంతో 2016-17లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ విషయంపై ‘శిక్షణ మండలి’ అంగీకరిస్తే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.