న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలదళం ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా గత ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని నియోజకవర్గాలపై దృష్టి సారిం చింది. గత విధానసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ, తూర్పు న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో కమలానికి ఆశించినమేర ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో తన పట్టును పెంచుకోవాలని నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా మయూర్ విహార్, షహదారా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఓటర్లను ఆకట్టుకునేందుకుగాను త్వరలో వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగనున్నామని తెలియజేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అయితే 2013 నాటి విధానసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఆప్ విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. గత విధానసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగానే ఉన్నప్పటికీ బీజేపీ ఓటుబ్యాంకు పెరగలేదు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం తూర్పు ఢిల్లీ లోక్‌సభ పరిధిలోని పది నియోజకవర్గాలకుగాను ఆరింటిని కైవసం చేసుకుంది.
ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ తూర్పుఢిల్లీ నియోజకవర్గంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకుగాను బూత్‌స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాను కూడా త్వరలో పరిశీలిస్తామన్నారు.కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.
విజయకేతన మే లక్ష్యం ప్రాబల్యంలేని ప్రాంతాలపై కమలం దృష్టి
Published Sun, Nov 16 2014 10:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement