మంత్రివర్గ ప్రక్షాళనపై సీఎం సిద్ధరామయ్య స్పష్టమైన సందేశాన్ని అందించారు. ‘మూడేళ్లు మంత్రులుగా పనిచేసినందుకు ....
ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ
మూడేళ్లు పనిచేసినందుకు ధన్యవాదాలు
మంత్రుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మంత్రివర్గ ప్రక్షాళనపై సీఎం సిద్ధరామయ్య స్పష్టమైన సందేశాన్ని అందించారు. ‘మూడేళ్లు మంత్రులుగా పనిచేసినందుకు మీకు ధన్యవాదాలు. హై కమాండ్ ఆదేశాలను అనుసరించి రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు కావాలి. ఇందు కోసం ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. మంత్రి వర్గంనుంచి తొలగింపునకు గురయ్యేవారు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి.’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత 2013న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యవధి మరో రెండేళ్లలో ముగియనున్నా ఇప్పటికీ చాలా మందికి సరైన పదవులు దక్కలేదని హస్తం నాయకులే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని హై కమాండ్ నిర్ధారణకు వచ్చింది. దీంతో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రిమండలి వ్యవస్థీకరణకు పచ్చజండా ఊపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం బుధవారం విధానసౌధలో మంత్రి పరిషత్‌ను ఏర్పాటు చేశారు. మొదట మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసిఅభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అటుపై అధికారులందరినీ బయటికి పంపించి మంత్రులతో మాత్రం ప్రత్యేకంగా సమావేశమై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం. మంత్రి మండలి ప్రక్షాళనలో తన పాత్ర ఏమీ లేదని, అంతా హై కమాండ్ నిర్ణయం మేరకు జరుగుతోందని సిద్ధరామయ్య మంత్రులకు తెలిపారు.
ఇప్పటికే మంత్రులందరి పనితీరుకు సంబంధించి హై కమాండ్‌కు నివేదిక వెళ్లిందన్నారు. అందువల్ల ఎవరెవరిని మంత్రి మండలి నుంచి తొలగించాలన్న విషయంపై హై కమాండ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన వారికి పార్టీలో మంచి పదవులు దక్కుతాయని, రానున్న ఎన్నికల్లోపు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. అటుపై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా సిద్ధరామయ్య మంత్రులకు సూచించారు. ఇందుకు 11 మంది మంత్రులు మాత్రమే తమ సమ్మతిని తెలియజేయగా మిగిలిన వారు ‘ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ వల్ల అసమ్మతి పెరిగి పార్టీ పటిష్టత దెబ్బతింటుందని, అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడుతాం.’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పరిషత్‌లో వెల్లడైన అభిప్రాయలతో కూడిన నివేదికతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌తో కలిసి గురువారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి ప్రక్షాళనకు తుది అనుమతి పొందనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లో మంత్రి వర్గంలో ఉండేది ఎవరూ, తొలగించబడేది ఎవరనే విషయం తేలిపోనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలోని మరోవర్గం నాయకులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈనెల 17 వరకూ మాత్రమే ఢిల్లీలో ఉంటారని, అటుపై పదిహేను రోజుల పాటు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా మంత్రి వర్గ వ్యవస్థీకరణ వాయిదాపడే అవకాశం ఉందనేది వారి భావన. ఏది ఏమైనా మంత్రి మండలి ప్రక్షాళనలో భాగంగా మంత్రి మండలిలో స్థానాలను ఆశిస్తున్న వారిలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, బసవరాజరాయరెడ్డి, రిజ్వాన్ అర్షద్, మాలికయ్య గుత్తేదార్‌లు ముందువరుసలో ఉన్నారు.