సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి అరెస్ట్ వ్యవహారంలో దుందుడుకుగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై ఎట్టకేలకూ వేటు పడింది. సంబంధిత ఇన్‌స్పెక్టర్ ప్రభును తిరువేర్కాడు క్రైం బ్రాంచ్‌కి బదిలీచేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:పోయస్‌గార్డెన్, సచివాలయం సమీపంలో జయలలిత ఫ్లెక్సీలతోపాటూ పురసవాక్కం రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అనేక బ్యానర్లను ట్రాఫిక్ రామస్వామి ఇటీవల తొలగించారు. వీరమణి అనే పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై వేప్పేరీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ప్రభు రామస్వామిని తెల్లవారుజాము 3.45గంటలకు అరెస్ట్ చేసి, మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలిం చారు. ఇదే సమయంలో ఒక డీఎంకే నేత తమ సమావేశానికి బ్యానర్లు కట్టుకునేందుకు అనుమతించాల్సిందిగా పోలీసుశాఖకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించింది. డీఎంకే నేత కోర్టును ఆశ్రయించగా, బ్యానర్లను అదుపుచేసేందుకే నిరాకరించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో సమర్థించుకున్నారు.
అధికార పార్టీ దరఖాస్తు చేసుకున్నా ఇలాగే నిరాకరిస్తారా అంటూ కోర్టు నిలదీసింది. ట్రాఫిక్ రామస్వామి అరెస్ట్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించి పోలీస్ చర్యను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నగర పౌరులకు ఇబ్బందులు కలిగే బ్యానర్లను అధికారులు అడ్డుకోరు, అడ్డుకునేవారిని జైళ్లలోకి నెట్టుతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముందురోజు కేసు నమోదు చేసి పక్కరోజు తెల్లవారుజామున ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అయనేమైనా తీవ్రవాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో సంబంధిత ఇన్‌స్పెక్టర్ ప్రభును తిరువేర్కాడు క్రైంబ్రాంచ్‌కు బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం రాత్రి ఆకస్మికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
రామస్వామికి బెయిల్
చంపుతానని బెదిరించాడంటూ పారిశ్రామికవేత్త వీరమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్‌యిన ట్రాఫిక్ రామస్వామికి ఎగ్మూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రామస్వామికి ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్సకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ మంజూరు చేయాలని రామస్వామి పిటిషన్ పెట్టుకున్నారు. వారానికి ఒకసారి కోర్టుకు హాజరై సంతకం పెట్టేలా షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
బదిలీ వేటు
Published Wed, Mar 18 2015 1:39 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement
Advertisement