నానో ఐడియా | bangalore drivers nano idea | Sakshi
Sakshi News home page

c ఐడియా

Published Wed, Apr 30 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

నానో ఐడియా

నానో ఐడియా

  • బెంగళూరు డ్రైవర్ల యోచన
  • ఆటోల స్థానంలో కార్లు
  • టాక్సీలు, ఏసీ కార్ల కంటే తక్కువ చార్జీకే సేవలు
  •   సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆటోల్లో తిరిగి తిరిగి బెంగళూరు డ్రైవర్లకు మొహం వాసింది.  వాటికి బదులు నానో కార్లలో ప్రయాణికులను చేరవేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నగరంలోని అనేక మంది డ్రైవర్లకు తట్టింది. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం సాయమందిస్తే క్రమంగా ఆటోలు కనుమరుగు కానున్నాయి.ప్రభుత్వ నిబంధనల కారణంగా పాత ఆటోలను మార్చుకోవాల్సిన డ్రైవర్లు, వాటి స్థానంలో ఏకంగా నానో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. నగరంలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆటో చార్జీలకే టాక్సీ సేవలను అందించడానికి ముందుకు వచ్చాయి. కనీస చార్జిని మినహాయిస్తే, ఆటోలో ఎంతవుతుందో, టాక్సీలలో కూడా అంతే అవుతోంది. కనీస చార్జిని రూ.100గా నిర్ణయించినందున, ఇంకా ఆ టాక్సీలు అంతగా ప్రజాదరణ పొందలేక పోతున్నాయి. నానో కారును కొనుగోలు చేయాలనుకుంటున్న ఆటో డ్రైవర్లు... టాక్సీలు, ఏసీ కార్ల కంటే తక్కువ చార్జీకే సేవలు అందించాలని యోచిస్తున్నారు. నలుపు రంగులోని 2 స్ట్రోక్ పాత ఆటోలను మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇదివరకే డ్రైవర్లకు సూచించింది. గ్యాస్ కిట్‌తో కూడిన ఆకు పచ్చ ఆటోలను కొనుగోలు చేయడానికి రూ.30 వేలు సబ్సిడీ కూడా ఇస్తోంది. దీనికి బదులు ఏకంగా నానో కార్లనే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన డ్రైవర్లకు తట్టింది. ప్రస్తుతం ఓ ఆటో ధర ఆన్ రోడ్ రూ.1.60 లక్షలవుతోంది. నానో కారు ధర రూ.2 లక్షలు. పాత ఆటోలను మార్చుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, పన్ను రాయితీలను కలుపుకొంటే ఆటో ధరకే నానో కారును కొనుగోలు చేయవచ్చనేది డ్రైవర్ల యోచన. నగరంలో 1.20 లక్షల ఆటోలున్నాయని అంచనా.

     అనధికారికంగా తిరుగుతున్న ఆటోలను కలుపుకొంటే ఆ సంఖ్య 1.50 లక్షలు. వీటిలో 32 వేల పాత ఆటోలున్నాయి. వీటిని గ్రామాలకు తరలించి ఆకు పచ్చ ఆటోలను కొనుగోలు చేయడానికి డ్రైవర్లు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు మూడు చక్రాల వాహనాల లెసైన్స్‌లు ఇస్తున్నారు. దీనిని నాలుగు చక్రాల లెసైన్స్‌గా మార్చాలని డ్రైవర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఆటో ఫైనాన్స్‌లో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రభుత్వం పన్ను, సెస్ తగ్గిస్తే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదా కావడమే కాకుండా నేరుగా డీలర్ల వద్దకు వెళ్లి కార్లను కొనుగోలు చేయవచ్చని డ్రైవర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఆటో కనీస చార్జి రూ.25 కాగా, తదుపరి ప్రతి కిలోమీటరుకు చార్జిని రూ.13గా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement