బీబీఎంపీ విభజన అనివార్యం
- విపక్షాల వాకౌట్ మధ్య సభ అమోదం
సాక్షి, బెంగళూరు : బీజేపీ, జేడీఎస్ నాయకుల వాకౌట్ మధ్య బీబీఎంపీ విభజనకు సంబంధించి రూపొందించిన ‘కర్ణాటక నగర పాలికె విభజన-15’ ముసాయిదా బిల్లుకు శాసనసభలో మంగళవారం అంగీకారం లభించింది. బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయించాలనే ఉద్దేశంతోనే పదేపదే ప్రభుత్వం ‘విభజన’ మంత్రం జపిస్తోందని ఈ సందర్భంగా విపక్షనాయకులు ఆరోపించారు. శాసనమండలిలో తిరస్కరణకు గురైన ముసాయిదా బిల్లును న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తిరిగి శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సమయంలో విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ... ఈ ముసాయిదా అంగీకారం కోసమే గతనెల మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభా సమావేశాలు జరిగాయన్నారు.
సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కారణంతో ముసాయిదా బిల్లుకు శాసనసభలో అంగీకారం లభించినా పరిషత్‌లో సదరు ముసాయిదా బిల్లు విషయంలో అధికార పార్టీకు భంగపాటు ఎదురైందన్నారు. మండలి అధ్యక్షుడి సూచన మేరకు ఏర్పాటైన సెలక్ట్ కమిటీలోని పదమూడు మంది సభ్యుల్లో ఏడుగురు సభ్యులు ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, కేవలం ఆరుగురు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారన్నారు. అయినా తిరిగి శాసనసభలో ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పదేపదే ముసాయిదా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టి విలువైన సభాసమయాన్ని వ్యర్థం చేస్తోందని విమర్శించారు. మొదట
ఎన్నికలు నిర్వహించి అటుపై బీబీఎంపీను ఐదు కాదు... 50 భాగాలుగా విభజించినా తమకు అభ్యంతరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో బీజేపీకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ...‘పాలనా సౌలభ్యం కోసమే అధికార పార్టీ పాలికెను విభజించాలనుకుంటే ఈ ప్రక్రియను ఏడాది ముందుగానే చేసి ఉండవచ్చుకదా?. హై కోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సూచించినా... ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామన్న భయంతోనే ప్రభుత్వం పదేపదే విభజన మంత్రం జపిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార విపక్షాల విమర్శల మధ్యనే ముసాయిదా బిల్లు పై ఓటింగ్ పెట్టడానికి సమాయత్తమయ్యారు. దీంతో బీజేపీ, జేడీఎస్ శాసనసభలోని వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. అయితే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముసాయిదా బిల్లుకు తమ మద్దతు తెలిపారు. మూజువాణి ఓటుతో ముసాయిదా బిల్లు పాస్‌అయినట్లు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలోనే విపక్షాలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇదిలా ఉండగా శాసనసభలో రెండోసారి ముసాయిదా బిల్లు అంగీకారం పొందినందువల్ల మరోసారి పరిషత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా గవర్నర్ అనుమతి కోసం బిల్లు రాజ్‌భవన్‌కు వెళ్లనుంది.
అక్కడ అనుమతి లభించిన వెంటనే బీబీఎంపీ విభజన జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించనుంది.ృబహత్ బెంగళూరు మహానగర పాలికె లేనప్పుడు దానికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నుంచి అనుమతి తీసుకుని ఎన్నికలను వాయిదా వేయించాలనే ఉద్దేశంతో ముసాయిదా బిల్లును రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.