అరెవో సాంబ! షోలే థీమ్‌ పార్క్‌ ఎక్కడ? | Bengaluru to Ramanagara: on the 'sholay' trail | Sakshi
Sakshi News home page

అరెవో సాంబ! షోలే థీమ్‌ పార్క్‌ ఎక్కడ?

Published Mon, May 22 2017 4:06 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

Bengaluru to Ramanagara: on the 'sholay' trail

బెంగళూరు: 1975లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన బాలీవుడ్‌ చిత్రం ‘షోలే’ గురించి తెలియని తరంగానీ, వినని తరంగానీ ఉండదేమో! అందులో ఏదో సీను, ఎప్పుడోసారి ప్రేక్షకుల మనోఫలకంపై ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అందుకనే బెంగళూరు–మైసూర్‌ మధ్య పర్యటించే పర్యాటకులు షోలే సినిమా షూటింగ్‌ జరిగిన కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని సందర్శిస్తారు.

‘అదిగో ఆ పర్వతంపైనే, అక్కడే గబ్బర్‌ సింగ్‌ గుర్రంపై వచ్చి ఠాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ భార్య, పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఈ పక్కన బల్దేవ్‌ సింగ్‌ ఇల్లు సెట్టింగ్‌ ఉండేది. అదిగో అల్లంత దూరాన ఠాకూర్‌ రెండు చేతులు నరికేసిన గబ్బర్‌ సింగ్‌ డెన్‌’ అంటూ దారినపోయే దానయ్యలెందరో ఇక్కడికొచ్చిన పర్యాటకులకు చెబుతుంటారు. ఈ రామనగరాన్నే సినిమాలో రామ్‌గఢ్‌గా వ్యవహరించారు.

ఈ ప్రాంతాన్ని ‘షోలే’ థీమ్‌తోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ అటవి శాఖ మాత్రం అందుకు అనుమతించడం లేదు. షోలే షూటింగ్‌ జరిగిన ప్రాంతం కేంద్ర రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేసేందుకు అనుమతించమని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.

ఈ భూమంతా తమ రెవన్యూ శాఖ పరిధిలోనే ఉన్నందున షోలే థీమ్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే చెబుతున్నారు. ఇక్కడ షోలో సినిమాలో ఉన్నట్లుగానే గ్రామం సెట్టింగ్, గబ్బర్‌ సింగ్‌ గుడారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 120 ఎకరాల పరిధిలో ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ప్రోత్సహించే సౌకర్యాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు ఉంటాయని ఆయన చెప్పారు.

రాబందుల సంరక్షణ కేంద్రం
దేశంలో నానాటికి అంతరించిపోతున్న రాబందులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడే 2012లో 346 హెక్టార్లలో ఓ శాంక్చరీని ఏర్పాటు చేసింది. భారత్, నేపాల్, పాకిస్థాన్‌ దేశాల్లో కనిపించే లాంగ్‌ బిల్డ్‌ జాతితోపాటు ఈజిప్టు, వీపు తెలుపురంగులో ఉండే మరోజాతి రాబందులు ఇప్పుడు ఈ శాంక్చరీలో ఉన్నాయి. భారత దేశంలో లాంగ్‌ బిల్డ్‌ జాతి రాబందులు 97 శాతం, ఈజిప్టు జాతి రాబందులు 99 శాతం నశించి పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ శాంక్చరీని ఏర్పాటు చేసింది.

అభ్యంతరం పెడుతున్న పర్యావరణవేత్తలు
షోలే థీమ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తే  శాంక్చరీకి ముప్పు వాటిల్లుతుందని ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పర్యావరణవేత్త శివనంజయ్య తెలిపారు. గబ్బర్‌ సింగ్‌ గుహ వాస్తవానికి సాంక్చరీ లోపల ఉన్నప్పటికి అక్కడికి పర్యాటకులను అనుమతించమని,  శాంక్చరీ సరిహద్దు నుంచే ఆ గుహ గురించి చెబుతామని, పైగా  శాంక్చరీకి పది కిలోమీటర్ల ఇవతల నుంచి నిర్మించే షోలే థీమ్‌ పార్కులోనే గబ్బర్‌ గుహను ఏర్పాటు చేస్తామని పర్యాటక మంత్రి ఖర్గే చెబుతున్నారు. రాబందులవి చాలా సున్నితమైన జీవితాలని, వాటికి సరిహద్దులు గుర్తించే తెలివితేటలు కూడా లేవని శివనంజయ్య అంటున్నారు. ఇప్పటికే శాంక్చరీ లోపలున్న రామ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు రావడం, అప్పుడప్పుడు ఉత్సవాలు జరపడం వల్ల రాబందులకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఏ ప్యాసేజ్‌ టూ ఇండియా’ కూడా ఇక్కడ తీసిందే

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు డేవిడ్‌లీన్‌ తీసిన ‘ఏ ప్యాసేజ్‌ టు ఇండియా’ చిత్రం కూడా ఇక్కడ తీసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం షూటింగ్‌ను 1983–1984లో ఇక్కడ రామనగరలో నిర్వహించారు. అప్పడు ఇక్కడి పర్వతాలపై కొన్ని బండరాళ్లను బాంబులతో పగులగొట్టడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో తొలిసారిగా 1966లో జాన్‌బెర్రీ తీసిన జంగిల్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మాయా’ షూటింగ్‌ జరిగింది. ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్‌ యెదేకర్‌ ఆ తర్వాత ‘షోలే’కు పనిచేశారు. యెదేకర్‌ సూచన మేరకే రమేష్‌ సిప్పీ షోలే షూటింగ్‌ను ఇక్కడ తీశారు.

నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి
షోలో షూటింగ్‌ నాటి జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని రాబందుల శాంక్చరీకి వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల వీరయ్య తెలిపారు. షూటింగ్‌ నాటికి 18 ఏళ్లు ఉన్న వీరయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. అవసరమైనప్పుడల్లా గబ్బర్‌ సింగ్‌కు తుపాకీ తెచ్చియ్యడమే తన పాత్రని, ప్రభుత్వం థీమ్‌ పార్క్‌ను అభివద్ధి చేస్తే తాను గైడ్‌గా పనిచేస్తానని వివాదంతో సంబంధంలేని వీరయ్య చెప్పారు. షోలో థీమ్‌ పార్క్‌ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు కూడా వివాదాల కారణంగా ఫలించలేదు. ఈసారి ఎందుకో తమ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశతో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement