
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా?
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా? ఇటీవల సెక్స్ వేధింపులు అంటూ ప్రకటనలు చేసి కలకలం సృష్టించిన ఈ భామ ఇప్పటి వరకు తెర ముందు పలు అనుభవనాలను చవి చూశారు. ఆ అనుభవాలతో ఇకపై కెమెరా వెనుక కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు కోలీవుడ్ సమాచారం. మల్లిక తమిళంలో ఆటోగ్రాఫ్, తిరుప్పాచ్చి తదితర చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా మలయాళంలో పలు చిత్రాలను చేసిన ఈమె తాజాగా, దర్శకత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఆమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో భావన నటిస్తున్నట్టు తెలిసింది. మల్లిక, భావన గతంలో మలయాళ చిత్రంలో కలిసి నటించారు.
ఆ పరిచయంతోనే మల్లిక దర్శకత్వంలో నటించేందుకు భావన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ చిత్ర కథ కథనాలను ప్రముఖ మలయాళ రచయిత తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు చిత్తిరం పేసుదడి, దీపావళి, తదితర చిత్రాల్లో నటించిన భావన ఆ తర్వాత ఆశించిన అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్, మాలీవుడ్‌లపై దృష్టి పెట్టారు. ఆమె కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం అసల్. మల్లిక చిత్రంతో మరో సారి కోలీవుడ్‌లో పాగా వేయాలని భావన భావిస్టున్నట్టు సమాచారం.