అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు
Published Fri, Aug 9 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. దీనికోసం ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకుంటోంది. ఇవి నగరంలోని ప్రతి ఇంటికీ సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఒక్కో ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనే అంశాల వారీగా సర్వే చేస్తున్నాయి. అలాగే ఏయే స్థానాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి, ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశాలపై కూడా అంతర్గతంగా సమాచారాన్ని అధ్యయనం చేయిస్తోంది. వీటి ఆధారంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించి ప్రజల ముందుకు వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. పోలింగ్ బూత్‌ల వారీగా అధ్యయనం చేసిన నివేదికల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. 26 స్థానాల్లో బీజేపీ సులువుగా విజయం సాధించగలదని పార్టీ అంతర్గత సర్వే చెబుతోంది. పది సీట్లలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుందని సదరు అధ్యయనంలో తేలింది.
నగరంలోని నియోజకవర్గాలను బీజేపీ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తోంది. బీజేపీ పక్కాగా విజయం సాధించగల సీట్లను ఏ కేటగిరీలో చేర్చారు. విజయం కోసం దృష్టి సారించవలసిన నియోజకవర్గాలను బి కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీ కింద 14 సీట్లున్నాయి. మరింతగా పార్టీ దృష్టి పెట్టవలసిన సీట్లను సి కే టగిరీలో చేర్చారు. దీని కింద 20 నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ తప్పక గెలిచే అవకాశాలున్న 10 సీట్లను డీ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో సీట్లను వీలైనంత తగ్గించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందా లేదా అన్నది, బీ,సీ కేటగిరీల్లోని 34 సీట్లపై ఆధారపడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ యోచిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఉన్న ముగ్గురు ఆశావహులను షార్ట్ లిస్టు చేయడం కోసం పార్టీ మూడు సర్వే ఏజెన్సీలను నియమించినట్లు తెలిసింది. ఈ సంస్థలు ఆగస్టు 25 నాటికి నివేదికలు సమర్పిస్తాయని అంటున్నారు.
సీఎం రేసులో హర్షవర్ధన్ పాటిల్
ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పాటిల్ ముందున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న విజయ్ గోయల్ కన్నా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్‌నే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోయల్ పనితీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు ఇప్పటికే పార్టీకి ఫిర్యాదులు అందాయి.
సీఎం అభ్యర్థిని నిర్ణయించలేదు
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి , ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై కేంద్ర పార్లమెంటరీ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై బోర్డు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement