న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ భవితవ్యాన్ని నిర్ణీత సమయంలో తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంపై కాంగ్రెస్, బీజేపీ, ఆప్ హర్షం వ్యక్తం చేశాయి. ఢిల్లీవాసులు కరెంటు, నీటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై త్వరగా తేల్చాలని కోర్టు ఆదేశించడం ముదాహవమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ మమ్నల్ని ఏ క్షణంలో పిలిచిన వెంటనే సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’మన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వమో, మైనారిటీ ప్రభుత్వమో లేక మళ్లీ ఎన్నికలు జరపడమో అనేది ఎల్జీ నిర్ణయిస్తారన్నారు.
ప్రజలు విద్యుత్, మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి నుంచి ఢిల్లీవాసులకు విముక్తి రావాలంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. నిబంధనల ప్రకారం నగరంలోని తుగ్లకాబాద్, క్రిష్ణ నగర్, మెహ్రౌర్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉన్నందున, వాటిని తప్పించుకోవడానికి ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేయాలని శర్మ సూచించారు. ఇదిలా ఉండగా, అన్ని పార్టీల నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఎల్జీ ఎందుకు రాతపూర్వక సమాధానం కోరడం లేదని ఆప్ ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా తమ అభిప్రాయం చెప్పాలని బీజేపీని ఎల్జీ అడగాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అసెంబ్లీని రద్దుచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు.
సుప్రీం ఆదేశంపై హర్షం
Published Tue, Aug 5 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement