
బీజేపీకే అనుకూల పవనాలు
సోమలింగప్ప
సిరుగుప్ప : తాలూకాలో వీస్తున్న బీజేపీ అనుకూల పవనాలకు ఈసారి ఏపీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్లతో పతనమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్.సోమలింగప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం స్థానిక మంజునాథ కల్యాణ మంటపంలో వచ్చే నెలలో జరుగనున్న సిరుగుప్ప వ్యవసాయ మార్కెట్ యార్డు ఎన్నికల సమీక్ష సమావేశంలో కార్యకర్తల నుద్ధేశించి మాట్లాడుతూ వచ్చే నెలలో జరుగనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 9 స్థానాలను కై వసం చేసుకొని బీజేపీ సత్తా ఏమిటోనని మరోసారి కాంగ్రెస్ పార్టీకి చూపించాలని పిలుపు నిచ్చారు.
టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రైతుల కోసం నవంబరు 20 వరకు ఎల్‌ఎల్‌సీ కాలువకు తుంగభద్రా డ్యాం నుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సభ్యులు, తాలూకా పంచాయతీ సభ్యులు, నగరసభ సభ్యులు, పార్టీ తాలూకా అధ్యక్షులు, తాలూకా ఎస్‌టీ మోర్చా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.