సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలోని కూటమి లక్ష్యంగా బీజేపీ కసరత్తుల్లో మునిగిన విషయం తెలిసిందే. ఆ కూటమిలోకి ఐజేకే, కొంగు మక్కల్ కట్చి, కొండు దేశీయ కట్చి, పుదియ నిధి తదితర పార్టీలు చేరాయి. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, రాందాసు నేతృత్వంలోని పీఎంకేలను తమ కూటమిలోకి చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలే పట్టాయి. విజయకాంత్, రాందాసు పెట్టిన డిమాండ్లకు తలొగ్గారు. అయితే, సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు అన్నీ సజావుగా ముగిసినట్టేనని భావించిన బీజేపీ శ్రేణులు బుధవారం తమ కూటమి పార్టీలను ప్రకటించేందుకు సిద్ధం అయ్యాయి.
కూటమిని బీజేపీ ప్రకటించబోతున్న సమాచారంతో కమలాలయంకు మీడియా ఉరకలు తీసింది. అయితే సాయంత్రానికి కూటమి పార్టీలను ప్రకటించేందుకు బీజేపీ సమయాత్తమైనా, చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ఇందుకు కారణం సీట్ల పందేరం కొలిక్కి రాకపోవడమే. 18 సీట్లకు విజయకాంత్, పది సీట్లకు రాందాసు పట్టుబట్టడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి కమలనాథులకు ఏర్పడింది. మంగళవారం రాత్రి హుటాహుటిన బీజేపీ శ్రేణులు అటు విజయకాంత్ వద్దకు, ఇటు రాందాసు వద్దకు పరుగులు తీసినట్టు సమాచారం. అయితే, సీట్ల పందేరంలో ఆ ఇద్దరు మెట్టు దిగనట్టు తెలిసింది. దీంతో కూటమి ప్రకటనను వాయిదా వేసుకున్న బీజేపీ వర్గాలు ఢిల్లీకి ఉరకలు తీశాయి.
ఢిల్లీకి పరుగు
కూటమిలో స్తబ్ధత నెలకొనడంతో కమలనాథులు ఆందోళనలో పడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటీన ఢిల్లీకి రావాలంటూ ఇక్కడి నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణే శన్, మరో నాయకుడు మోహన్ రాజు బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. మీనంబాక్కం విమానాశ్రయంలో పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందన్నారు. గురువారం అధిష్టానంతో సమావేశం కానున్నామని, శుక్రవారం తమ కూటమిని ప్రకటిస్తామన్నారు. ఇప్పటి వరకు తమ వెంటే పార్టీలు ఉన్నాయని ఓ ప్రశ్నకు ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి ఝలక్!
Published Thu, Mar 6 2014 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement