గ్లామర్‌కు పట్టం
సాక్షి, చెన్నై: సినీ గ్లామర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ బిజేపిలో పదవుల పంపిణీ సాగాయి. డీఎంకే నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్‌కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. దర్శకుడు కస్తూరి రాజా, సంగీత దర్శకుడు గంగై అమరన్, నటీమణులు కుట్టి పద్మిని, గాయత్రి రఘురామన్‌లకు పదవులు దక్కాయి. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా తామే అవతరించాలన్న కాంక్షతో కమలనాథులు ఉరుకులు పరుగు లు తీస్తున్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా కుస్తీలు పడుతూనే మరో వైపు సినీ గ్లామర్ మీద కన్నేసి తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు.
ఆ దిశగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించి, చివరకు కంగుతిన్నారు. ఇలయ దళపతి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో ఇక, ఆయన తమ వైపే అన్నట్టుగా ప్రచారం చేసుకుని చివరకు భంగపడ్డారు. ఎలాగైనా సీని గ్లామర్‌ను పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి రప్పించుకోవడం లక్ష్యంగా నేటికీ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆ దిశగా కొందరు సినీ నటులు బీజేపీ వైపుగా మొగ్గు చూపి ఉన్నారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత నెపోలియన్ ఇటీవల కమలం తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే దర్శకుడు కసూర్తి రాజా, సంగీత దర్శకుడు గంగై అమరన్, నటీమణులు కుట్టి పద్మిని, గాయత్రి రఘురామన్ వంటి వాళ్లు కమలంకు తమ సేవలు అందించేందుకు సిద్ధం అయ్యారు. తమ పార్టీలోకి వచ్చే సినీ గ్లామర్‌కు పెద్ద పీట వేస్తూ పదవులు కట్ట బెట్టే పనిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నిమగ్నం అయ్యారు. ఆదిశగా కమలం కండువా కప్పుకున్న వాళ్లకు పదవుల్ని కేటాయిస్తూ, ఇటీవల కాలంగా ఇతర పార్టీలను వీడి తమ పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలకు పదవుల గుర్తింపు కల్పించారు.నెపోలియన్‌కు పదవి: కేంద్ర మంత్రిగా, దక్షిణాది డీఎంకే కింగ్ మేకర్ ఎంకే అళగిరి నమ్మిన బంటుగా వ్యవహరించి ఆ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన సినీ నటుడు నెపోలియన్‌కు మంచి గుర్తింపునే ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెట్టారు.
ఇటీవల తన పార్టీని బీజేపీలోకి విలీనం చేసిన మక్కల్ తమిళగం కట్చి నేత కవిదాసన్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, వేదారణ్య మాజీ ఎమ్మెల్యే వరదారత్నంను పార్టీ కార్యవర్గ సభ్యుడిగా, రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించారు. మరో మాజీ ఎమ్మెల్యే మణికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పదవి కట్ట బెట్టారు. సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్‌కు పార్టీ కళా విభాగం పులవర్‌గా(పండితుడు), దర్శకుడు కస్తూరి రాజాను ఆ విభాగం ఉపాధ్యక్షుడిగా, గాయత్రి రఘురామన్‌ను కార్యదర్శిగా, కుట్టి పద్మినిని ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. మాజీ ఐఏఎస్ అధికారి మలై స్వామిని ఎన్నికల విభాగానికి, మాజీ ఆర్మీ అధికారి కల్నల్ పాండియన్‌ను మాజీసైనికుల విభాగం అధ్యక్షుడిగా పదవి అప్పగించారు. తమ పార్టీలోకి వచ్చే ప్రముఖులకు పదవులు గ్యారంటీ అని చాటే విధంగా ఇటీవలే అడుగు పెట్టిన వాళ్లకు కమలం జట్టులో చోటు దక్కడం విశేషం.