'డీఎంకే కంటే శశికళనే బెస్ట్'
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన గందరగోళ పరిస్థితులపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. డీఎంకేను జాతి విద్రోహక, హింసాత్మక పార్టీగా అభివర్ణించారు. డీఎంకే కంటే జైలులో ఉన్న శశికళనే చాలా బెస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి చెందిన సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్షను నేడు డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఓటింగ్ ను మరోరోజు వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ జరుపాలంటూ ప్రతిపాదనలను తీసుకొచ్చారు. అయితే వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో డీఎంకే సభ్యులు ఆయనపై కుర్చీలు, పేపర్లు విసిరేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా వేశారు.