‘బ్లడీ మెంటల్ స్టేట్’ అంటారా... క్షమాపణ చెప్పండి
- లేదంటే సినిమాను అడ్డుకుంటాం
- ‘ఫైండింగ్ ఫ్యానీ’ చిత్ర బృందంపై కన్నడ సంఘాల మండిపాటు
సాక్షి, బెంగళూరు : అర్జున్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘ఫైండింగ్ ఫ్యానీ’ చిత్రంపై రాష్ర్టంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైండింగ్ ఫ్యానీ సినిమా ట్రైలర్‌లో కనిపిస్తున్న ఓ దృశ్యం కన్నడ సంఘాల ఆగ్రహానికి గురవుతోంది. వివరాలను పరిశీలిస్తే...‘ఫైండింగ్ ఫ్యానీ పేరిట తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఫ్యానీ అనే వ్యక్తి కోసం ఐదుగురు వ్యక్తులు చేసే వెదుకులాట ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వీరి వెదుకులాటలో భాగంగా వివిధ రాష్ట్రాలకు వెళతారు. ఆ సమయంలో ఒక చోట వారు ప్రయాణిస్తున్న కారు ఆగిపోయినపుడు ఆబందంలోని ఓ వ్యక్తి ‘మనం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నామంటూ?’ ప్రశ్నిస్తారు. దీనికి అర్జున్ కపూర్ ‘బ్లడీ మెంటల్ స్టేట్’ అంటూ అసహనంగా బదులిస్తాడు. ఆ సమయంలో అక్కడ కన్నడలో ‘చాముండినగర బస్ నిల్దాణ’ అనే బోర్డు సినిమా ట్రైలర్‌లో కనిపించడంతో సినిమాృబందం ‘బ్లడీ మెంటల్ స్టేట్’ అంటూ పేర్కొన్నది కర్ణాటకనేనని కన్నడ సంఘాలు పేర్కొంటున్నాయి.
కర్ణాటకను, కన్నడిగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ‘ఫైండింగ్ ఫ్యానీ’ చిత్ర బృందం తక్షణమే రాష్ట్ర వాసులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కన్నడ చళువళి వాటాళ్ పార్టీ వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజ్ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ‘బ్లడీ మెంట్ స్టేట్’ అంటూ క న్నడిగులను తీవ్రంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వాసులకు చిత్ర బృందం క్షమాపణలు చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వాటాళ్ నాగరాజ్ హెచ్చరించారు.