సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. జయలలిత చాలా రోజులుగా చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లోనే నివసిస్తున్నారు. ముఖ్యమంత్రి కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎవ్వరినీ ఆ ప్రాంతం వైపు అనుమతించరు. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అలా అనుమతి పొందినా అనేక దశల్లో సెక్యూరిటీ చెకింగ్‌ను దాటాల్సి ఉంటుంది.
సీఎం బంగ్లా చుట్టూ 24 గంటలూ సాయుధ పోలీసులు కాపలా ఉంటారు. ఇంతటి భధ్రతా ఏర్పాట్ల నడుమ ఉన్న సీఎం బంగ్లాలో బాంబు పెట్టామని, అది మరికొద్ది సేపట్లో పేలుతుందని చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఆదివారం రాత్రి అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో గగుర్పాటుకు గురైన కంట్రోల్ రూము అధికారులు వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు విచారణకు దిగారు. విళుపురం జిల్లా మరక్కానం కూనీమేడు గ్రామం నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసుల తొలి దశ విచారణలో తేలింది. ప్రత్యేక దళానికి చెందిన పోలీసులు రాత్రికి రాత్రే అక్కడికి చేరుకుని భువనేశ్వరన్(21) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. అయితే భువనేశ్వరన్ మతిస్థిమితం లేనివ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.