మృత్యుంజయుడు
Published Tue, Apr 15 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా శంకరన్ కోయిల్ సమీపంలోని కుత్తాలం పేరి గ్రామంలో తండ్రి గణేషన్‌తో కలసి నిమ్మతోటకు హర్షన్(3) వెళ్లాడు. సరిగ్గా పదిన్నర గంటల సమయంలో తండ్రితో కలసి అడుగులు వేస్తున్న చిన్నోడు బోరు బావిలో పడిపోయూడు. తండ్రి గణేశన్ వెంటనే ఆందోళనలో పడ్డాడు. ఆయన కేకలను విన్న అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి: తనయుడు బావిలో పడిన ఆందోళన నుంచి తేరుకున్న గణేషన్ చాకచక్యంగా వ్యవహరించారు. తనయుడికి ధైర్యాన్ని నూరి పోస్తూ పై నుంచి తానూ లోనికి వస్తున్నా, అక్కడే ఉండు ఆడుకుందాం అంటూ పదే పదే చెబుతూ హర్షన్‌లో భయాన్ని తొలగించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకున్నారు.
బాలుడికి ఆక్సిజన్ సరఫరా అయ్యే ఏర్పాట్లు చేశారు. అలాగే, అతడితో మాట్లాడుతూనే ఉండమంటూ గణేషన్‌కు సూచించిన అధికారులు సహాయక చర్యల్లో మునిగారు.సహాయక చర్యలు: నాలుగు జేసీబీలను రప్పించి ఆ బోరు బావికి సమాంతరంగా పక్కనే గోతి తవ్వేందుకు చర్యలు తీసుకున్నారు. బోరు బావిలోకి కెమెరాను పంపించి బాలుడు ఎంత లోతులో ఉన్నాడో పసిగట్టారు. సరిగ్గా 15 అడుగుల కింద ఆ బాలుడు ఉన్నట్టు తేలింది. ఆ బోరు బావి 400 అడుగులు కావడంతో ఏ సమయంలో బాలుడు కిందకు జారుతాడోనన్న ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. సరిగ్గా 8 అడుగుల లోతు వద్ద అతి పెద్ద బండరాళ్లు అడ్డు పడటంతో గంట పాటుగా సహాయక చర్యలకు ఆటంకం నెలకొంది. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు కెమెరా ద్వారా పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. బండరాళ్ల తొలగింపునకు డ్రిల్లింగ్ యంత్రాల్ని ఉపయోగించడంతో, మట్టి పెళ్లలు బాలుడి నెత్తిన పడ్డట్టు గుర్తించారు. దీంతో సహాయక పనుల్ని ఆపేశారు.
రంగంలోకి ప్రత్యేక బృందం : మదురైకు చెందిన మణిగండన్, రాజ్‌కుమార్, తిరునావుకరసు, వల్లరసుల నేతృత్వంలోని ప్రత్యేక బృందం బోరు బావుల నుంచి పిల్లల్ని రక్షించే రోబోను ఇటీవల తయారు చేసింది. దీన్ని పలు చోట్ల ప్రయోగించినా, ఫలితం శూన్యం. అయితే, మదురై నుంచి గంటన్నర వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఈ బృందం మూడున్నర గంటల పాటుగా శ్రమించింది. చేతి ఆకారాన్ని తలపించే రీతిలో కింది భాగంలోను, పై భాగంలో అత్యాధునిక యంత్రాలతో సిద్ధం చేసిన తమ రోబోను ఆ బోరు బావిలోకి చాకచక్యంగా పంపించింది. ఆ రోబో, కెమెరాలు, లైట్లు లోనికి వెళ్లే సమయంలో గణేషన్ ఇచ్చిన ధైర్యం ఆ చిన్నాడిలో భయాన్ని పూర్తిగా పోగొట్టిందని చెప్పవచ్చు. తానూ లోనికి వస్తున్నా, చూస్తూ ఉండు, తల పైకి ఎత్తు అంటూ ఆయన పెట్టిన కేకలకు తోడుగా లోనికి వెళ్లిన రోబో ఆ బాలుడ్ని ఆమాంతంగా పైకి తీసుకొచ్చేసింది. పదిహేను అడుగుల లోత నుంచి బయట పడ్డ చిన్నాడు అక్కడి జనాన్ని చూసి షాక్‌కు గురయ్యాడో ఏమో గానీ, తనకు ఏదో జరిగిందన్న ఆందోళన కాసింత కూడా అతడి ముఖంలో కన్పించక పోవడం విశేషం.
మృత్యుంజయుడు: బోరు బావి నుంచి మృత్యుంజయుడిగా బయట పడ్డ హర్షన్‌ను హుటా హుటిన ఓ పోలీసు అధికారి తన భుజాన వేసుకుని అంబులెన్స్‌లో శంకరన్ కోయిల్ ఆస్పత్రికి ఉరకలు తీశారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు ఆ బాలుడికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మృత్యుంజయుడిగా ప్రకటించారు. అతడికి ఇన్ఫెక్షన్ మాత్రం ఉందని, అందుకు తగ్గ చికిత్సలు అందించామని, అతడికి ఇక ప్రాణహాని లేదని వైద్యులు ప్రకటించడంతో బోరు బావి నుంచి రాష్ట్రంలో మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన వారిలో హర్షన్ రెండో వాడయ్యాడు. ప్రశంసల జల్లు: బోరు బావి నుంచి రోబో యంత్రం సాయంతో బయట పడ్డ హర్షన్ అందరినీ అటు ఇటూ చూస్తుండడంతో అక్కడున్న వాళ్లనే కాదు, ఓ ఛానల్ ప్రత్యక్షంగా ప్రసారం చేసిన ఈ దృశ్యాల్ని చూసిన వారిని ఆనందంలో పడేసింది. రోబోను సకాలంలో సంఘటనా స్థలానికి తీసుకొచ్చి, తమ సేవలను అందించిన మదురైకు చెందిన సహాయక బృందాన్ని ఆ జిల్లా కలెక్టర్ కరుణాకరన్, అగ్నిమాపక అధికారి పద్మకుమార్ అభినందించారు. అక్కడ సేవలను అందించిన ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. ఆరు గంటల వ్యవధిలో బాలుడిని రక్షించిన తమ బృందం సేవలను ప్రత్యేకంగా కొనియాడుతూ కలెక్టర్ ఆనందంలో ఉబ్బితబ్బియ్యారు.
గుర్తింపు ఇవ్వండి: తాము పన్నెండు రకాల రోబోలను సిద్ధం చేశామని ఆ ప్రత్యేక బృందం పేర్కొంది. తమకు సకాలంలో సమాచారం అందిన పక్షంలో రక్షించేందుకు వీలుందన్నారు. ఆరు, ఎనిమిది, పన్నెండు ఇంచ్‌లతో కూడిన రోబోలు తమ వద్ద ఉన్నాయని వివరిస్తూ, గతంలో తాము పలు మార్లు ఈ పరికరాల్ని ఉపయోగించినా, ఆలస్యం కారణంగా పిల్లలను రక్షించ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే, ప్రస్తుతం తమకు సమాచారం త్వరితగతిన రావడంతో సకాలంలో ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. మానవ నిర్మిత రోబోను తాము ఉత్కంఠ భరితంగా ఉపయోగించినా, ఆ దేవుడి ఆశీస్సులు చిన్నోడికి ఉండబట్టే సురక్షితంగా బయట పడ్డాడని ఆ బృందానికి చెందిన మణిగండన్ పేర్కొనడం విశేషం. తాము సిద్దం చేసిన రోబోలకు గుర్తింపు ఇవ్వాలని, దీనిని ప్రతి అగ్నిమాపక వాహనంలో తప్పని సరిగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నీళ్లు లేని బోరు బావుల్ని మూసి వేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు అమల్లో బేఖాతరు అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా రాష్ట్రంలో ఇద్దరు లేదా, ముగ్గురు పిల్లలను బోరు బావులు మింగేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు బోరు బావుల్లో పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతున్నారు. సరిగ్గా ఈ నెల ఐదో తారీఖున విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని త్యాగరాయ దురం పల్ల చేరి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమార్తె మధుమిత(3)ను బోరుబావి మింగేసింది. ఈ చిన్నారిని రక్షించేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేశారు. ప్రాణాలతో బోరు బావి నుంచి బయటకు తీసినా, ఆస్పత్రిలో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో శోకతప్త హృదయంలో మునిగిన రాష్ట్ర ప్రజలు, సోమవారం ఉదయాన్నే మరో చేదు సమాచారాన్ని విని తల్లడిల్లారు. కానీ హర్షన్ క్షమంగా బయటపడడంతో అందరూ ఆనందంలో మునిగి తేలారు.
Advertisement