
కర్ణాటక,దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లాలో గత నాలుగు రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నెట్‌వర్క్ అందడం లేదు. ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలన్నీ నిలిచిపోవడంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌పై శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలోని కనకపుర తాలూకాలో కంపెనీకి చెందిన నెట్‌వర్క్ కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. మరమ్మత్తులు జరుగుతున్నాయని త్వరలో సేవలు ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో మూడు రోజులుగా కస్టమర్లు రామనగర పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో గొడవపడుతున్నారు. సిబ్బంది షరా మామూలుగానే నిర్లక్ష్యంగా జవాబిస్తుండడంతో కస్టమర్లు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు.
ఈ కారణంగా సిబ్బంది కూడా కార్యాలయంలో ఉండకుండా వెళ్లిపోతున్నారు. రామనగర తాలూకాలో 1800 ల్యాండ్‌లైన్ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు ఉండగా,వేల సంఖ్యలో మొబైల్ సిమ్‌కార్డులు వాడుతున్నారు. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్‌లు తీసుకుని ఉండడంతో ప్రజలకు ప్రభుత్వపర సేవలు అందడంలేదు. ఇంతపెద్ద కంపెనీ నాలుగు రోజులుగా సేవలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment