వాగులో చిక్కుకున్న బస్సులు.. నిలిచిపోయిన రైళ్లు
నిన్నటి వరకు హైదరాబాద్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాపై పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట శివార్లలో రెండు బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ బస్సులోంచి కేకలు పెట్టారు. దాంతో స్థానికులు అక్కడకు వెళ్లి, జాగ్రత్తగా ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే వారి సామాన్లు అన్నీ బస్సులోనే మిగిలిపోయాయి. బస్సు కూడా వాగునీటిలో ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోను, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి.
సత్తెనపల్లిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్ల, గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేట లోని శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరదనీరు చేరుకోవడంతో, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగులేరు, చంద్రవంక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం గారపాడు వద్ద గండి పడింది. దీంతో వరద నీరు భారీగా పంటపొలాల్లోకి చేరుతోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో అధికారులకు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి తలెత్తింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)