చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత్‌లోని రిటైల్ రంగంలోకి 51 శాతం ఎఫ్‌డీఐని గత యూపీఏ ప్రభుత్వం అనుమతించింది. ఎఫ్‌డీఐ వల్ల లెక్కలేనన్ని విదేశీ స్టోర్లు దేశంలో వెలుస్తాయి. రిటైల్ వ్యాపార రంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో విస్తరిస్తాయి. దీని వల్ల భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు వ్యాపారులు, రైతులు దారుణంగా నష్టపోతారు. మెగామార్ట్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ షాపులను తెరిచేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. చిల్లర వర్తకంలో విదేశీయులు ప్రవేశిస్తే తమ గతేంటని రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టారు. అన్ని వ్యాపార సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం వ్యాపార సంఘాల గోడును పట్టించుకోకుండా బ్రిటన్‌కు చెందిన టెస్కో కంపెనీకి చేసిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఆమోదించింది.
చెన్నై అన్నానగర్‌లో మెగామార్ట్ స్థాపనకు రంగం సిద్ధమైంది. అంతలోనే ఎన్నికలు రావడం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ పతనం, మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఎఫ్‌డీఐలను అనుమతించబోమని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఎఫ్‌డీఐలను అనుమతిస్తే దేశంలోని చిల్లర వర్తకులు, చిన్నకారు రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల హామీకి అనుగుణంగా చేసిన ప్రకటన రాష్ట్రంలోని వ్యాపారుల్లో ఆనందాన్ని నింపింది. మల్టీబ్రాండ్ రిటైల్ రంగం మినహా ఉద్యోగాల కల్పన, ఆస్తుల సృష్టి, మౌలిక సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీ సమకూర్చుకునే రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తామని మంత్రి పేర్కొనడం పట్ల తమిళనాడు వాణిజ్య, వ్యాపార సంఘం హర్షం వెలిబుచ్చింది. చెన్నై టీనగర్‌లోని కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ రాజా, ప్రధాన కార్యదర్శి మోహన్, ముగప్పేర్ వ్యాపార సంఘం అధ్యక్షులు సెల్లదురై మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని నిరసిస్తూ గతంలో అనేక ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాల్సిందిగా తాము కేంద్రాన్ని కోరామని చెప్పారు. అయితే తమ ఆవేదనను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఘోర పరాజయం ద్వారా వ్యాపారులు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ తన తొలి అధికార ప్రకటనే ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా చేయడం కోట్లాదిమంది వ్యాపారస్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమలో కలిగిందని చెప్పారు.
వ్యాపారుల సంబరం
Published Wed, May 28 2014 11:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement