పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ప్రచారం జోరందుకుంటుంది. పుణేలో వరుస ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి గోఖలేనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని కొందరు శ్రీమంతులను మరింత శ్రీమంతులుగా చేయడమే అభివృద్ధి కాదన్నారు. మోడీ తయారుచేసిన అభివృద్ధి అనే గాలిబుడగ పేలిందని అందులో అభివృద్ధి చెందిన వారెవరో దేశ ప్రజలందరూ చూడగలిగారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ , బీజేపీ రెండూ అవినీతి బురదలో ఉన్న పార్టీలే అన్నారు.
మహారాష్ట్రలో అశోక్ చవాన్, కర్ణాటకలో యడ్యూరప్పలను ఆయా పార్టీలు తిరిగి అభ్యర్థులుగా చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో అవినీతిపై పోరాటానికై పుట్టిన పార్టీ ఆమ్‌ఆద్మీపార్టీ అని పేర్కొన్నారు. దేశంలోని పేద కుటుంబాలకు నిలయమైన మురికివాడల నుంచి ఐటి పార్కులో పనిచేసే వారి వరకు ఆమ్‌ఆద్మీ పార్టీకి పునాదులు లాంటివారనీ, వారే పార్టీకి నాయకులని, దేశంలో పెచ్చిరిల్లిపోతున్న అవినీతిని ప్రశ్నించడానికి అందరినీ కలుపుకుపోతున్న పార్టీ ఆప్ అని వివరించారు. ఈ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా వుండగా పుణే కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదమ్ బుధవారం రాత్రి వాన్వాడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీపీలకు చెందిన అభ్యర్థులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి దేశంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ కలలు కనాల్సిందే తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేదని ఎద్దేవా చేశారు. జస్వంత్‌సింగ్‌లాంటి సీనియర్ నేతలు ఆ పార్టీపై చేసిన విమర్శలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని, అరచేతిలో అభివృద్ధి చూపించే మోడీ మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.
శిరూర్ ఎమ్మెన్నెస్ అభ్యర్థి అశోక్‌రావ్ ఖండే బరాడ్‌ను గెలిపించాలని కోరుతూ ప్రస్తుత ఎంపీ గజానన్ బాబర్ చిఖిలో ఏర్పాటు చేసిన సభలో కోరారు. శిరూర్ పార్లమెంట్ సభ్యుడు శివాజీరావు ఆడల్‌రావు రాజకీయాలలో ఫిక్సింగ్‌కు పాల్పడే వ్యక్తి అని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు.
శివసేన పార్టీని నడిపించే సత్తా ఉద్ధవ్‌కు లేదని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అశోక్‌ను గెలిపించాలని కోరారు. కాగా ప్రచారంలో దూసుకుపోతున్న అశోక్.. శిరూర్‌లో తనను గెలిపించాలని కోరుతున్నారు. ఇన్నాళ్లూ ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడల్‌రావ్ పాటిల్ చేసింది శూన్యమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శిరూర్‌లో శివసేన సిట్టింగ్ అభ్యర్థి ఆడల్‌రావు పాటిల్ గ్రామగ్రామాన ఓటర్లను కలసి వారి సమస్యలను వింటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే హవేలిలో యశ్వంత్ సహకారంతో చక్కర ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని పాటిల్ నగర ప్రజలకు వాగ్దానం చేశారు.
కాగా 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు, రాష్ట్రంలో జలాలపై కూడా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఆదర్శ్ కుంభకోణంలో మరింతగా బురద పూసుకుందని, ఇలాంటి పార్టీలను శాశ్వతంగా భూస్థాపితం చేయాలని లోణి-కాల్బోరేలో పిలుపునిచ్చారు. తన నియోజక వర్గంలో రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులను చేశానని, తన అభివృద్ధి పనులపై ప్రశ్నించేందుకు ఏమీలేకనే ప్రతిపక్షాలు కువిమర్శలకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. కాగా పాటిల్‌కు మద్దతుగా బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని శెత్కారీ సంఘటన్, ఆర్‌ఎస్‌పీలు ప్రచారం చేస్తుండగా, ఎమ్మెన్నెస్ అభ్యర్థిని నిలపడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది.
ఊపందుకున్న ప్రచారం
Published Thu, Apr 3 2014 10:54 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement