న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలైతే ఓటుకో నోటో.., మందు బాటిలో ఇస్తే సరిపోతోంది. అదే విద్యార్థి సంఘం ఎన్నికలైతే... పిజ్జాలు, బర్గర్లు ఇవ్వాలి.... డూసూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాయి. ఆలోచించడమే కాదు ఆచరిస్తున్నాయి కూడా. ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు విద్యార్థులకు తాయిలాలతో ఎర వేస్తున్నాయి. ఓటు వేయాలంటూ పిజ్జాలు, బర్గర్లతో పార్టీలిస్తున్నాయి. రహస్యంగా బహుమతులుగా మొబైల్ ఫోన్లు పంచుతున్నాయి. ఎన్‌ఎస్‌యూఐని గెలిపించేందుకు కాంగ్రెస్, ఏబీవీపీని గెలిపించేందుకు బీజేపీ శాయశక్తులా ‘కృషి’ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు డూసూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా డీయూ ఆధ్వర్యంలోని పలు కళాశాలలకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.
నగరంలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటిగా చెప్పుకునే శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో డజన్ల సంఖ్యలో రాజకీయ నేతలు కనిపిస్తున్నారు. ఒక్క బీజేపీ చెందిన నేతల ఆరుగురు నేతలు ఈ కాలేజీకి వచ్చి ప్రచారం చేశారని విద్యార్థులు చెబుతున్నారు. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆగస్టు27న కాలేజీకి వచ్చి పరోక్షంగా ఏబీవీపీ తరఫున ప్రచారం చేసి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మరో నేత సుబ్రమణ్యన్ స్వామి కూడా హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ తరఫున శశి థరూర్ తదితర నేతలు హాజరయ్యారు.కాగా కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీతో ప్రచారం చేయించేందుకు ఏబీవీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల ఇప్పటిదాకా సమయం ఇవ్వలేదని తెలిసింది. అయితే ఎన్నికల సమయం మరింత దగ్గర పడ్డాక ఆమె విద్యార్థుల వద్దకు వస్తారని ఏబీవీపీ నేతలు చెబుతున్నారు.
ఇక ఎన్‌ఎస్‌యూఐ కూడా తామేమీ తీసిపోలేదన్నట్లుగా సీని యర్ కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయించేం దుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ డూసూలో కూడా సత్తా చాటాలని భావిస్తుండగా, డూసూ ఎన్నికల్లో సత్తా చాటి ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అన్ని కళాశాలల్లో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. రాజకీయ నేతల జోక్యం వల్ల విద్యార్థులను ప్రలోభపర్చుకునే సంస్కృతి మరింత పెరుగుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి ఇవన్నీ విరుద్ధమే అయినప్పటికీ యథేచ్ఛగా విద్యాలయాల ప్రాంగణంలో కొనసాగడం సరికాదన్నారు. నేతల అండదండలతో విద్యార్థులు ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని, ఆ నేతలకు భయపడి విద్యార్థి సంఘం నాయకులపై చర్యలు తీసుకునేందుకు విశ్వవిద్యాలయ వర్గాలు, పోలీసులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఓటుకో పిజ్జా..!
Published Thu, Sep 4 2014 11:01 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement