సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకువస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఆరోపించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంటి ఎదుట మంగళవారం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోజీ ఎం. జాన్ నేతృత్వంలోని కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని వెంటనే దేశానికి తీసుకొచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేశారు.
అయినప్పటికీ వాటిని తోసుకుంటూ ఆందోళనకారులు ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ... ‘నరేంద్ర మోడీ సర్కారు ఏర్పడిన 100 రోజుల్లో విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తామని పలువురు బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికలకు ముందు హామీలు కురిపించారు. 99 రోజులు పూర్తవుతున్నా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విదేశీ బ్యాంకులలో నిల్వ ఉన్న సొమ్ములో కనీసం ఒక్క రూపాయిని కూడా తీసుకురాలేకపోయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్‌కు బదులు స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే అక్కడి బ్యాంకులో దాచుకున్న నల్లధనం గురించి మాట్లాడేవార’న్నారు. ‘తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో విదేశీ ఖాతాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకువస్తామని రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 17న ఠాణేలో చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విషయంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైంద’ని ఎన్‌ఎస్‌యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే విమర్శించారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జాన్, అధికార ప్రతినిధి రంజన్‌పాండేతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పార్లమెంట్ స్ట్రీట్ ఫోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఒక్క రూపాయీ తేలేదేం?
Published Tue, Sep 2 2014 10:13 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement