
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
లక్ష రూపాయల కరెన్సీ ఇస్తే రెండు లక్షలొస్తాయని అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకున్నారు పలువురు
రూ.లక్షకు రెండు లక్షలు
అమాయకులకు కుచ్చుటోపీ
వీరి నుంచి రూ.30 లక్షల నగదు,
పోలీస్ డ్రస్సులు, కత్తులు స్వాధీనం
గ్యాంగ్‌లో కోలారుకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్
కోట్లు సంపాదించిన తిరుపతి వాసి
పలమనేరు : లక్ష రూపాయల కరెన్సీ ఇస్తే రెండు లక్షలొస్తాయని అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకున్నారు పలువురు అమాయకులు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు ఓ ముఠాగా తయారై దొంగలుగా, నకిలీ పోలీసులుగా దాడులకు పాల్పడి లక్షలాది రూపాయలు కొట్టేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 2014 డిసెంబర్ ఆఖరు నాటికి 2005 సంవత్సరం లోపు ముద్రించిన నోట్లను బ్యాంకుల్లో మార్పు చేసుకోవాలనే నిబంధనను వీరు ఇలా క్యాష్ చేసుకున్నారు. గంగవరం సర్కిల్ పోలీసులు 11 మంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.30 లక్షలు రికవరీ చేశారు.
సిద్దగంగప్ప మఠంలో కోట్లున్నాయంటూ నమ్మబలికారు..
కర్ణాటకలోని సిద్దగంగప్ప మఠంలో 2005కు ముందు ముద్రించిన కరెన్సీ కోట్లాది రూపాయలు ఉందని, దీన్నంతా బ్యాంకుల్లో మార్చుకోవడం ఇబ్బందిగా ఉందని ఈ గ్యాంగ్ అమాయకులను బుట్టలో వేసుకుంది. వీరి మాటలు నమ్మి బెంగళూరుకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి రూ.25 లక్షలు, కౌశిక్‌రెడ్డి రూ.6 లక్షలు పొగొట్టుకున్నారు.
దొంగలు, పోలీసులు వీరే..
ఒకటికి రెండింతల నగదొస్తుందని ఆశపడి హర్షవర్ధన్‌రెడ్డి రూ.25 లక్షలతో బంగారుపాళ్యం సమీపంలోకి ఆ ముఠా చెప్పిన చోటుకు వెళ్లాడు. వీరు చీకట్లో మాట్లాడుతుండగానే పోలీసుల జీపులో ఇదే ముఠాకు చెందిన నకిలీ పోలీసులు దాడులకు పాల్పడి నగదును లాక్కెళ్లారు. పెద్దపంజాణి వద్ద కౌశిక్‌రెడ్డి రూ.6 లక్షల నగదును సైతం ఇదేవిధంగా దోచుకె ళ్లారు.
కోలారుకు చెందిన హెడ్‌కానిస్టేబులే కీలకం..
ప్రస్తుతం కోలారు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాపన్న ఈ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి. నకిలీ పోలీసులకు పోలీస్ యూనిఫాం, టోపీలు, సంకెళ్లు తదితరాలను అందించి అదే గ్యాంగ్‌లో పోలీస్ స్టైల్‌లో ఈ మోసాలకు పాల్పడ్డాడు. గతంలో నంగిలి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పటి నుంచి ఇతనికి ఈ బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఎర్రచందనం స్మగ్లర్లతోనూ ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్ర పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడంతో విధుల నుంచి తొలగించినట్లు స్థానిక డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు.
ముఠా సభ్యుల వివరాలు..
ఈడిగట్టు చంద్ర అలియాస్ రాజా: ముఠా నాయకుడు నక్కలవాండ్ల పల్లె గ్రామం, గుర్రంకొండ మండలం. మదనపల్లెలో ఉంటూ దాదాపు పది గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకున్నాడు. అన్ని రకాల మోసాల్లోనూ సిద్ధహస్తుడు. కందూరి రమణారెడ్డి: ఇతని సొంతూరు కేవీ పల్లె సమీపంలోని నల్లకమ్మరెడ్డిగారిపల్లె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ చాకచక్యంగా మాట్లాడి అందరినీ బురిడి కొట్టిస్తుంటాడు. నాలుగైదు భాషల్లో ప్రావీణ్యం ఉంది.
నరసింహులు: సొంతూరు గుర్రంకొండ సమీపంలోని గంగిరెడ్డిగారిపల్లె. ప్రస్తుతం తిరుపతిలోని కొర్లగుంటలో ఉంటూ బొరుగులు అమ్ముకుంటూ ఉంటాడు. అమాయకులను టార్గెట్ చేసి లక్షకు రెండు లక్షలంటూ నమ్మించి ఉచ్చులోకి దింపుతాడు.
లంకిపల్లె గుర్రప్పనాయుడు: సొంతూరు సోమల సమీపంలోని నెల్లిమంద. తిరుపతి మునిరెడ్డినగర్‌లో కాపురముంటున్నాడు. అక్కడ పెద్ద మనిషిగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడిన డబ్బుతో కోటికి పైగా అధిక వడ్డీలతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మల్లి మొగ్గల ఉమాపతి: తుమ్మలగుంట వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కాపురం. గుర్రప్పనాయుడుకు బావమరిది. గ్యాంగ్‌లో సహాయకుడు.
సుబ్రమణి: కర్ణాటకలోని బంగారుపేట తాలూకా సుందరపాళ్యం సొంతూరు. కర్ణాటక గ్యాంగ్‌కు నాయకుడు. నకిలీ పోలీస్ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరిస్తాడు.
నంజప్పన్: ఇతనిది కోలారు సమీపంలోని నందంహళ్లి. నకిలీ ఎస్‌ఐగా గ్యాంగ్‌లో ఉంటాడు.
సురేష్: ఇతనిది సిద్లగట్ట సమీపంలోని అండిగవాడ. నకిలీ పోలీస్ కానిస్టేబుల్.
నారాయణస్వామి : హొస్కోట సమీపంలోని కారెళ్లకు చెందిన ఇతను గ్యాంగ్‌లో నకిలీ పోలీస్.
గోలా వీరప్పనాయుడు: కలకడ సమీపంలోని ఎనుగొండపాళ్యంకు చెందిన ఇతను మెయిన్ గ్యాంగ్ నాయకుడు.
పాపన్న: నిజమైన హెడ్ కానిస్టేబుల్. ప్రస్తుతం కోలార్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఇతని సొంతూరు శ్రీనివాసపురం సమీపంలోని వక్కలేరి.