న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి విద్యార్థులందరికీ 2018 నుంచి బోర్డు పరీక్షలు తప్పనిసరి కానున్నాయి. సంబంధిత ప్రతిపాదనను సీబీఎస్‌ఈ గవర్నింగ్ బోర్డు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. 2017–18 విద్యా సంవత్సరం నుంచి ఈ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకరించారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం ఆమోదించగానే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం సీబీఎస్‌ఈ విద్యార్థులు బోర్డు పరీక్షలనో లేదా పాఠశాల ఆధారిత(స్కూల్ బేస్డ్) పరీక్షలనో ఎంపిక చేసుకుంటున్నారు. బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ, స్కూల్ బేస్డ్ పరీక్షల్లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనొకటి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతులకు అమలుచేస్తున్న త్రిభాషా సూత్రాన్ని(హిందీ, ఇంగ్లిష్, ఒక భారతీయ భాషా బోధన) 9, 10వ తరగతులకు కూడా వర్తింపజేయాలని మావన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.