పల్లెల్లో ఫ్యాక్షన్‌ను ఉసిగొల్పుతున్నారు
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు ఫ్యాక్షన్‌ను ఉసి గొల్పుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన వేంపల్లి మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రామిరెడ్డి ఎదుగుదలను సహించలేకనే టీడీపీ వాళ్లు ఆయనను హత్య చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అండతోనే ఈ దురాగతానికి ఒడిగట్టారని తెలిపారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
''చంద్రబాబు సిగ్గుతో తల వంచుకోవాలి. రాజకీయాలు చేసేటపుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి. ప్రజలు మనకు తోడుగా ఉండాలంటే వాళ్ల గుండెల్లో స్థానం సంపాదించాలి గానీ, రాజకీయమంటే చంద్రబాబు నిజంగా ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో దారుణంగా ఈ మాదిరిగా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు. రామిరెడ్డి కుటుంబం ఉసురు ఆయనకు తగులుతుంది. ఒక మనిషి చనిపోతే ఇంతమంది బాధపడేవాళ్లు ఉన్నారంటే.. వాళ్లందరి ఉసురు చంద్రబాబుకు తగలకుండా పోదు. రాజకీయం అంటే హత్యలు, ఫ్యాక్షనిజం కాదు, మనసులలో స్థానం సంపాదించుకోవడమేనని చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థం కావాలి, దేవుడు మొట్టికాయలు వేయాలని కోరుతున్నా.''