
చంద్రప్రభ అరసు ఇక లేరు
కర్ణాటక మాజీ సీఎం దేవరాజు అరసు కుమార్తె, మాజీ మంత్రి చంద్రప్రభ అరసు(70) కన్నుమూశారు.
► గుండెపోటుతో మైసూరులో మృతి
► రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా సేవలు
► చంద్రప్రభ అరసు భౌతికకాయానికి సీఎం నివాళి
మైసూరు : కర్ణాటక మాజీ సీఎం దేవరాజు అరసు కుమార్తె, మాజీ మంత్రి చంద్రప్రభ అరసు(70) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 9 రోజులుగా మైసూరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రప్రభకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం చంద్రప్రభ భౌతికకాయాన్ని బుధవారం మైసూరులోని లక్ష్మీ పురంలో ఉన్న ఆమె నివాసానికి తరలించారు. తర్వాత స్వగ్రామం హుణసూరు తాలూకాలోని కళహళ్లికి తరలించి బుధవారం తండ్రి సమాధి పక్కనే అంత్య క్రియలు నిర్వహించారు.
చంద్రప్రభ హణసూరు అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, మైసూరు ఎంపీ స్థానం నుంచి ఒక పర్యాయం ఎంపీగా గెలుపొందారు. రామకృష్ణ హెగ్డె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె మంత్రిగా పని చేసారు. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్, ఇతర మంత్రులు లక్ష్మీ పురంలోని చంద్రప్రభ నివాసం వద్దకు వెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మంత్రిగా ఆమె రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.