మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక మహిళా పార్క్
సదస్సులో సీఎం సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ, సహకారాలు అందజేసేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో భాగంగానే మహిళల కోసమే ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలను ‘మహిళా పార్క్’ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక కేంద్రాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలకు 5శాతం ప్రాంతాన్ని తప్పనిసరిగా కేటాయించాల్సిందిగా నిబంధనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సును సీఎం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తల్లో 51.9శాతం మంది కర్ణాటక వారే కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. మైసూరు జిల్లాలోని హారోహళ్లి వద్ద మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఓ పారిశ్రామిక వాడను, హుబ్లీ-ధార్వాడ ప్రాంతంలో మరో పారిశ్రామిక వాడను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ రెండు పారిశ్రామిక వాడలను ‘మహిళా పార్క్’ పేరిట కేవలం మహిళా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
సమాజంలో లింగ వివక్ష, అసమానతలను నివారించేందుకు స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాలని సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఏదైనా సమస్యలు తలెత్తితే తనను నేరుగా సంప్రదించవచ్చని సిద్ధరామయ్య సూచించారు. అనంతరం ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా నిలిచిన మహిళలను సిద్ధరామయ్య సన్మానించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న రత్నప్రభను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని మహిళా పారిశ్రామిక వేత్తలు సీఎంకు విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు.