
గందరగోళం
తమిళుల సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణ మీద తీవ్ర గందరగోళం నెలకొంది.
జల్లికట్టు అనుమతిపై ఆందోళన
కేంద్రం నిర్ణయం ఎటో సర్వత్రా ఉత్కంఠ
నోరు మెదపని కేంద్రమంత్రి జవదేకర్
మంత్రి వర్గంలో కానరాని చర్చ
తమిళుల సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణ మీద తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకీ అనుమతి దక్కుతుందా? లేదా అన్న ఉత్కంఠ బయలుదేరింది. బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో జల్లికట్టు ప్రస్తావనకు రాకపోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ జల్లికట్టు ప్రశ్నకు సమాధానం దాట వేయడం అనుమానాలకు దారితీస్తోంది.
చెన్నై : తమిళుల సాహసక్రీడగా, వీరత్వాన్ని చాటే క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఎద్దులను హింసిస్తున్నారన్న నెపంతో వ్యవహారం కోర్టుకు చేరడంతో జల్లికట్టుపై నిషేధం విధించా రు. ఈ నిషేధం ఎత్తి వేతకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు గళం విప్పుతూ వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతూ రాజకీ య పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జల్లికట్టుకు అనుమతి తప్పనిసరి అంటూ కేంద్రంలోని బీజేపీ పాలకు లు స్పష్టమైన హామీలు, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు సైతం స్పష్టత వ్యక్తం చేయడంతో ఈ ఏడాది సాహసక్రీడతో సంక్రాంతి సంబరాలు ఉంటాయన్న ఆశాభావం పెరిగింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం రెండు మూడు రోజుల్లో మంచి నిర్ణయం ఉంటుందన్న వ్యాఖ్యలు చేయడంతో ఆశలు రెట్టింపు అయ్యాయి. జల్లికట్టుకు సిద్ధం అవుతూ క్రీడాకారులు సాధనల్లో మునిగారు. ఎద్దులకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. బుధవారం నాటి పరిస్థితులు జల్లికట్టు నిర్వహణ అనుమతి దక్కుతుందా, లేదా అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నది.
గందరగోళం : జల్లికట్టు వ్యవహారంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠతో తమిళులు ఉదయం నుంచి ఎదురు చూశారు. జల్లికట్టుకు అనుమతి ఏ రూపంలో ఇస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇందుకు కారణం ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గం భేటీ కావడమే. అత్యవసర చట్టం తీసుకొస్తారా లేదా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుమతి ఇస్తారా..? అన్న ప్రశ్న నిర్వాహకుల్లో బయలు దేరింది. అయితే, జల్లికట్టు విషయంగా ఎలాంటి చర్చ కేంద్రం మంత్రి వర్గంలో సాగలేదన్న సమాచారంతో గందరగోళ పరిస్థితి బయలు దేరింది.
అసలు జల్లికట్టు ప్రస్తావనే ఆ సమావేశంలో లేని దృష్ట్యా, ఇక ప్రత్యేక చట్టం విషయంగా, ప్రత్యామ్నాయ మార్గం అంశంగా నిర్ణయాలు తీసుకుంటారా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ జల్లికట్టు విషయంగా ప్రశ్న లేవదీయగా దాటవేయడంతో మరింత ఉత్కంఠ బయలు దేరింది. ఇంతకీ జల్లికట్టుకు కేంద్రం అనుమతి ఇస్తుందా..? అన్న ప్రశ్న సర్వత్రా బయలు దేరింది.
అయితే, జంతు సంరక్షణ సంస్థ ఎలాంటి అనుమతి ఇవ్వని దృష్ట్యా, జల్లికట్టు ప్రస్తావనను మంత్రి వర్గం దృష్టికి తీసుకురాలేదని, మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం జల్లికట్టుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న భరోసా ఇచ్చే పనిలో రాష్ట్రంలోని కమలనాథలు నిమగ్నమయ్యారు. అనుమతి వచ్చినా, రాకున్నా, ఈ సారి మాత్రం నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించైనా జల్లికట్టును నిర్వహించి తీరుతామన్న హెచ్చరికల స్వరం పలు చోట్ల పెరుగుతుండటం గమనార్హం.