ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చర్చలు జరగాల్సిందేనని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ఎన్సపీతో కలిసి పనిచేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాలపై ఇరుపార్టీలు కూర్చుండి మాట్లాడుకోవాల్సిన అవసరముంది. 2004, 2009 సాధారణ ఎన్నికల సమయంలో ఇరుపార్టీలు సమావేశమై సీట్ల పంపకాల గురించి చర్చించుకున్నారు. మరి ఇప్పుడలా ఎందుకు జరగడంలేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుపార్టీల పెద్దలు ఈ విషయమై చర్చలు జరపాల్సిందే’నన్నారు.
సీట్ల పంపకాలపై కసరత్తు పూర్తయిందని, పాత ఫార్ములా ప్రకారమే లోక్‌సభ ఎన్నికలకు ఇరుపార్టీలు వెళ్తాయని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ ‘ఎలాంటి చర్చలు జరగకుండా ఎన్నికలకు ఎలా వెళ్తామ’ంటూ ప్రశ్నించారు. కేంద్రస్థాయిలో చర్చలు జరిగిన విషయం తనకు తెలియదని, అలా జరిగినట్లు ఇప్పటిదాకా తన దృష్టికి రాలేదన్నారు. ఇదిలాఉండగా ఇద్దరు నేతలు తాజాగా చేసిన విభిన్న ప్రకటనలతో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాల విషయమై సయోధ్య కుదరలేదనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజన్ 2014ను ప్రారంభించనున్న రాష్ట్ర కాంగ్రెస్
వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్ర కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందుకోసం 21న జరగనున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ‘విజన్ 2014’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సోమవారం పాత్రికేయులకు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మోహన్ ప్రకాశ్ తదతరులు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘వచన్ పూర్తి’ పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక ‘వికాస్ రథ్‌యాత్ర’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తున్నామని మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు.
చర్చలు జరగాల్సిందే!
Published Tue, Aug 20 2013 12:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement