గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు నెరవేర్చిందో తెలియజెప్పేందుకు ప్రజల్లోకి వెళ్లనున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు
ముంబై: గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు నెరవేర్చిందో తెలియజెప్పేందుకు ప్రజల్లోకి వెళ్లనున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఠాక్రే సమావేశం అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు వాగ్దానాలను చేసిందని, వాటిని నమ్మి పార్టీని గెలిపించిన ఓటర్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం తమ పనితీరును, నేరవేర్చుకున్న వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
మోడీ ప్రభావమేమీ పెద్దగా ఉండదు..
ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ మోడీ పేరును ప్రకటించినా పెద్దగా ప్రభావమేమీ ఉండదని ఠాక్రే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడం ఆసాధ్యమన్నారు. బీజేపీ వెనుక ఆరెస్సెస్ ఉందనే విషయం మోడీ పేరును ప్రకటించిన సందర్భంగా తేటతెల్లమైందన్నారురు. ఇక దభోల్కర్ హత్య ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఆరోపించడంపై మాణిక్‌రావ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేడం రాజ్‌ఠాక్రేకు అలవాటేనని విమర్శించారు