పుణె: కరోనా అనుమానితులు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పారిపోతున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని బలేవాడీ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల కరోనా బాధితుడు ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని 17 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎరవాడలోని తన ఇంటికి వెళ్లిపోయారు. ఐసోలేషన్ సెంటర్‌లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో పారిపోయానని అతడు మీడియాతో చెప్పాడు. సరైన ఆహారం పెట్టలేదని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని వెల్లడించాడు. కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించడంతో తాళం వేసివున్న ఇంటి ముందు దీనంగా కూర్చుని వున్న వృద్ధుడిని మంగళవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు.
ఎరవాడ ప్రాంత కార్పొరేటర్‌కు వారు సమాచారం అందించడంతో అతడు అంబులెన్స్‌లో తిరిగి ఐసోలేషన్ కేంద్రానికి వృద్ధుడిని తరలించాడు. అతడి కుమారుడు రెండు గంటల పాటు నచ్చజెప్పిన తర్వాత ఐసోలేషన్‌లో ఉండేందుకు వృద్ధుడు అంగీకరించాడు. ‘నేను సమాచారం ఇచ్చే వరకు వృద్ధుడు పారిపోయాడన్న విషయం కూడా అధికారులు గుర్తించలేదు. కరోనా అనుమానిత లక్షణాలతో ఏప్రిల్ 24న అతడిని రక్షక్‌నగర్ క్వారైంటన్ సెంటర్‌కు తరలించారు. తర్వాత రోజు కోవిడ్-19 నిర్థారణ కావడంతో అతడిని బలేవాడీలోని ఎన్‌ఐసీఎంఏఆర్‌కు తరలించార’ని కార్పొరేటర్ సిద్ధార్ట్ దండే తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో తగిన సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. కాగా, ఐసోలేషన్ నుంచి పారిపోయిన వృద్ధుడు ఎవరినీ కలవకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment