- మండలికి ఐదుగురి పేర్లు ప్రకటించిన కాంగ్రెస్
- ప్రస్తుత గవర్నర్ హయాంలోనే ఆమోదం పొందే యత్నం
- చివరి నిమిషంలో మోహన్ కొండజ్జీ,
- ఇవాన్ డిసౌజా పేర్ల తొలగింపు!
- ఆ స్థానంలో ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌లకు ఛాన్‌స
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేయడానికి అధికార కాంగ్రెస్ కసరత్తును పూర్తి చేసింది. వివిధ రంగాలకు చెందిన వారు ఈ నెల 20న రిటైర్ కానుండడంతో ఆ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ఈ నెల 29న రిటైర్ కానున్నారు. యూపీఏ హయాంలో నియమితులైన ఆయన స్థానంలో కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఎటూ తమ వారినే నియమిస్తుంది.
గవర్నర్‌తో సత్సంబంధాలు లేకపోతే వివిధ రంగాలకు చెందిన వారిని నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపే సిఫార్సులను ఒక పట్టాన ఆమోదించే ప్రసక్తే ఉండదు. కనుక ఈ వారంలోనే నామినేటెడ్ సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే అధిష్టానం వీఎస్. ఉగ్రప్ప, సినీ నటి జయమాల, మోహన్ కొండజ్జీ, ఇవాన్ డిసౌజా, అబ్దుల్ జబ్బార్ పేర్లను ఖరారు చేసింది.
అయితే తుది నిముషంలో వచ్చిన ఒత్తిళ్ల కారణంగా కొండజ్జీ, డిసౌజాల బదులు ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో సరడగి రెండేళ్ల కిందట శాసన సభ నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందున ఇండిపెండెంట్ భైరతి సురేశ్ గెలుపొందారనే ఆరోపణలు వచ్చాయి. ఉగ్రప్ప గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా పని చేశారు.
కాగా ఐదుగురితో కూడిన జాబితాను ముఖ్యమంత్రి ఏ క్షణంలోనైనా రాజ్ భవన్‌కు పంపే అవకాశాలున్నాయి. గవర్నర్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకు ముందే లేదా తిరిగి వచ్చిన తర్వాత ఈ జాబితాపై ఆమోద ముద్ర పడే అవకాశాలున్నాయి. బీజేపీ హయాంలో నియమితులైన డాక్టర్ ఎస్‌ఆర్. లీలా, డాక్టర్ దొడ్డ రంగే గౌడ, ప్రొఫెసర్ ఎంఆర్. దొరస్వామి, బీబీ. శివప్పలు రిటైర్ కానున్నారు.
వీరితో పాటే అబ్దుల్ జబ్బార్ కూడా రిటైర్ కావాల్సి ఉంది. అయితే నెల కిందటే ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆయనింకా శాసన మండలి సమావేశంలో పాల్గొనలేదు. అందువల్లే ఆయనను తిరిగి నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావణగెరె జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పని చేస్తున్న జబ్బార్ అనేక విద్యా సంస్థలకు అధిపతి కావడం గమనార్హం.