సాక్షి, న్యూఢిల్లీ:ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తోన్న కొద్దీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులలో ఉత్కంఠ పెరుగుతోంది. నెల రోజుల క్రితం జరిగిన పోలింగ్ ఫలితాలు రేపే వెల్లడవుతుండటంతో ఇన్నాళ్లు కాస్త ప్రశాంతంగా ఉన్న నేతల్లో ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. పైకి గెలుస్తామని చెబుతున్న ఆయా పార్టీల నేతలకు లోలోన మాత్రం తమ విజయంపై ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితమే ఢిల్లీలో పోలింగ్ జరగడంతో తమ గెలుపు ఓటముల అంశాలను కొంతవరకు పక్కనపెట్టి కుటుంబసభ్యులతో కాలం గడపడం, విహారయాత్రలకు, గుళ్లకు వెళ్లి ప్రార్థనలు చేయడంతో పాటు పలువురు అభ్యర్థులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ తమ పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు దేశమంతటా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో వారి ఆలోచనలు మళ్లీ ఇప్పుడు తమ రాజకీయ భవితవ్యంైపై కేంద్రీకృతమయ్యాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా ప్రముఖ పార్టీల అభ్యర్థులందరూ తాము ఎన్నికలలో గెలుస్తామన్న ధీమా కనబరుస్తూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఎలా ఉంటుందన్న దానిపైనే ఆయా పార్టీల అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. పశ్చిమ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కోసం ఏజెంట్ల జాబితా రూపొందిస్తున్నారు. ఏప్రిల్ పదిన పోలింగ్ ముగిసిన తర్వాత అరుణ్ జైట్లీ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకుఅమృత్‌సర్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. కుటుంబసభ్యులతో పాటు స్వర్ణ దేవాలయానికి వెళ్లి తన గెలుపు కోసం ప్రార్థన చేసినట్లు ఆయన చెప్పారు. అక్కడినుంచి వచ్చినప్పటి నుంచి తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రవేశ్ వర్మ ప్రత్యర్థి, పశ్చిమ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రా కూడా తన గెలుపు ఖాయమనే అంటున్నారు. ఢిల్లీలో పోలింగ్ ముగిసిన తర్వాత రీటా బహుగుణా జోషో తరపున ప్రచారం చేసేందుకు లక్నో వెళ్లానని చెప్పారు. తన కుటుంబసభ్యులతో కలిసి పోర్ట్‌బ్లెయిర్ విహారయాత్రకు వెళ్లొచ్చిన ఆయన వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలోనూ పాల్గొన్నారు.
వాయవ్య ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా ఏప్రిల్ పది తర్వాత రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుని పంజాబ్‌కు వెళ్లి పార్టీ తరపున ప్రచారం చే శారు. ఆ తర్వాత కుటుంబసభ్యులందరితో కలిసి వారణాసికి వెళ్లి పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారం చేయడంతో పాటు వారణాసి ఘాట్లపైనా, మందిరాలలో తన గెలుపు కోసం పూజలు చేశారు. ఈ నెల రోజులు ప్రచారంలో బిజీగా గడిపిన వాయవ్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి ఉదిత్ రాజ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుటుంబసభ్యులతో కలిసి యూరోప్, అమెరికా వెళతానని అంటున్నారు. ఢిల్లీలో పోలింగ్ ముగిసిన తర్వాత లక్నో, గుజరాత్, హరిద్వార్, నైనిటాల్‌లో ప్రచారం చేయడం వల్ల కుటుంబసభ్యులతో సరదాగా గడిపే సమయం దొరకలేదని చెప్పారు. తాను కూడా గ్వాలియర్, పంజాబ్, వారణాసిలో ప్రచారం చేశానని దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ బిధూడీ చెప్పారు.
గత నెల పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని రోజుల పాటు తన నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన దక్షిణ ఢిల్లీ ఆప్ అభ్యర్థి కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ ఆ తర్వాత వారణాసిలో కేజ్రీవాల్ కోసం ప్రచారం చేశారు. చాందినీచౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ హర్షవర్ధన్ ఈ నెల రోజులు తీరిక లేకుండా గడిపారు. విశాఖపట్నం, హైదరాబాద్, తూర్పు యూపీ, పంజాబ్‌లలో పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆయన గెలుపు ఓటములపై ఎలాంటి ఆందోళన లేదంటున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎలాంటి టెన్షన్ లేకుండా పోటీ చేశానని, ఎన్నికలలో తమ పార్టీ గెలుపు, తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి ఆశుతోష్ ఈ నెల రోజులు వారణాసిలో ప్రచారంలో గడిపారు. వారణాసిలో పోలింగ్ ముగిసిన తర్వాత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత పనులు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ ైవైష్ణోదేవీ మాతను ద ర్శించుకుని వచ్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలలో, లక్నోలో పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయితే ఇన్ని రోజుల ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ఢిల్లీకి చెందిన నేతలు ఇప్పుడే నగరానికి చేరుకున్నారు. శుక్రవారం జరిగే కౌంటింగ్‌లో ఏమీ జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
అ‘టెన్షన్’
Published Wed, May 14 2014 11:28 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement