కుమార్తెను కాటేసిన పాముతో ఆస్పత్రికి..
చెన్నై: కడలూర్‌లో ఓ డ్రైవర్ తన కుమార్తెను కాటు వేసిన పాముతో ఆస్పత్రికి రావడం కలకలం రేపింది. కడలూరు ముదునగర్ వసందరాయన్ పాలయం వినాయక ఆలయ వీధికి చెందిన అయ్యప్పన్ డ్రైవర్. ఇతని కుమార్తె శివశక్తి(11) ముదునగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బుధవారం తెల్లవారుజామున శివశక్తి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ పాము ఆమెను కాటు వేసింది.
నొప్పితో బాలిక కేకలు వేయడంతో అయ్యప్పన్ ఇంట్లోకి పరుగున వచ్చాడు. శివశక్తి సమీపంలో పామును చూసి, వెంటనే కర్రతో కొట్టి పామును చంపాడు. తరువాత పామును సంచిలో వేసుకొని, కుమార్తెను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌కు తన కుమార్తెను పాము కాటేసిందని చెప్పి, సంచిలో ఉన్న పామును చూపించాడు. దీంతో డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. డాక్టర్లు శివశక్తికి చికిత్సలు అందిస్తున్నారు.