
ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు
టీనగర్: ఇంటిని కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా మోసగించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే తనకు హత్యా బెదిరింపులు చేస్తున్నట్లు ఒక వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈరోడ్ జిల్లా, భవానీ రాణానగర్‌కు చెందిన వాసుదేవన్ దుప్పట్ల వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఈరోడ్ జిల్లా ఎస్‌పి సిబి చక్రవర్తికి మంగళవారం ఒక ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తనకు భవాని అన్నానగర్‌లో 5,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, ఫ్యాక్టరీ ఉండేదని తెలిపారు. పక్కింటిలో నివసిస్తున్న భవాని నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే నారాయణన్ తన ఇంటిని విక్రయించమని కోరారని, రూ.1.40 కోట్లకు విక్రయిస్తానని తెలిపానని అన్నారు.
తనకు మొదటి విడతగా రూ. 88.50 లక్షలు చెల్లించారని, మిగతా సొమ్ము తన భార్య సరస్వతి పేరిట ఇల్లు రాసిస్తే చెల్లిస్తానని తెలిపాడన్నారు. దీన్ని నమ్మి తాను అతని భార్య సరస్వతికి గత ఆగస్టు 26వ తేదీన ఇల్లు రాసిచ్చానన్నారు. ఆ తర్వాత మిగతా సొమ్ము 50 లక్షల రూపాయిలను కోరగా నగదు ఇవ్వడానికి నిరాకరించాడన్నారు. అంతేగాక తనకు హత్యా బెదిరింపులు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.