లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన దళిత నాయకుడు ఉదిత్‌రాజ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన దళిత నాయకుడు ఉదిత్‌రాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలతోపాటు వెనుకబడిన కులాలవారు అండగా ఉన్నారని, అందువల్ల ఈసారికూడా అధికారంలోకి వస్తామని ఆప్ కలగంటోందన్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు తమ పార్టీని నమ్ముతున్నారని, అందువల్ల త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో వారి కలలు కల్లలవడం తథ్యమన్నారు. శాసనసభ ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలతోపాటు వెనుకబడిన కులాల ఓటుబ్యాంకు తమదేనని ఒకవేళ ఆప్ భావిస్తే అది పొరపాటు మాత్రమే అవుతుందన్నారు. కాగా ఢిల్లీలో మొత్తం 12 రిజర్వ్‌డ్ స్థానాలు ఉండగా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. అదే ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలు కైవసం కావడంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారం చేపట్టింది. అయితే సరిగ్గా 49 రోజుల తర్వాత జన్‌లోక్‌పాల్ బిల్లు వీగి పోవడంతో అధికారం నుంచి వైదొలిగింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ బోల్తాపడింది. కేవలం నాలుగు స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ విషయమై ఉదిత్‌రాజ్ మాట్లాడుతూ దళితులే కాకుండా ఇతర వర్గాలు కూడా తమకు అండగా నిలిచాయనే విషయం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. అన్నివర్గాల ప్రజలకు తమ పార్టీపై విశ్వాసం పెరిగిందన్నారు.
ఆప్ నాయకుల లెక్కలన్నీ తప్పాయన్నారు. అందువల్లనే అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడన్నా రు. అయినప్పటికీ ఏదోవిధంగా జనసామాన్యాన్ని ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడన్నారు. తామే యోధులమని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారన్నారు. శాసనసభ ఎన్నికల కు బీజేపీ ఎజెండా ఎలా ఉండే అవకాశముందని ప్రశ్నించగా లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఉంటుందన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్, ఆప్‌లు తమకు పోటీయే కాదన్నారు. ఆప్ ఇప్పటికే ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విఫలమైందన్నారు. ఈసారి తమ పార్టీకి కనీసం 60 స్థానాలు రావడం తథ్యమన్నారు.