న్యూఢిల్లీ: మహిళలపై నేరాల నిరోధించడానికి వచ్చే ఏడాది కల్లా మూడు వేల మంది మహిళా పోలీసులను నియమించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహిళలకు సంబంధిం చిన సున్నితమైన అంశాలను పరిష్కరించేందుకు కానిస్టేబుల్ మొదలుకొని వివిధస్థాయిల అధికారులను నియమిస్తారు. ‘భర్తీ ప్రక్రియ ఇది వరకే మొదలయింది. ఎంపికైన వారికి భారీ ఎత్తున శిక్షణ ఇస్తాం. వచ్చే ఏడాది ముగిసేనాటికి మూడు వేల మంది మహిళా పోలీసులు ఉద్యోగాల్లో చేరతారు’ అని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
2012, డిసెంబర్ 16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవిదేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మహిళా పోలీసుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం నగరవ్యాప్తంగా ఉన్న 166 పోలీసు స్టేషన్లలో భారీగా మహిళా ఉద్యోగులను నియమిస్తారు. ఒక్కో స్టేషన్‌లో కనీసం ఇద్దరు ఎస్‌ఐలు, ఏడుగురు కానిస్టేబుళ్లు మహిళలు ఉండేలా చూస్తారు. ఈ మేరకు మహిళా పోలీసుల నియామకానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుశాఖలో 80 వేల మంది పనిచేస్తుండగా, వీరిలో ఏడు వేల మంది మహిళలు ఉన్నారు.
నిర్భయ అత్యాచారంపై విచారణ నిర్వహించిన న్యాయమూర్తి జె.ఎస్.వర్మ నేతృత్వంలోని కమిటీ పోలీసు స్టేషన్ల పనితీరులో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. మహిళా పోలీసుల సంఖ్యను మరింత పెంచాలని స్పష్టం చేసింది. అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి కేసుల్లో సమర్థంగా దర్యాప్తు చేయడానికి వీలుగా మహిళా అధికారులను అత్యున్నత స్థాయి శిక్షణకు పంపిస్తామని అధికారులు ప్రకటించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తారని తెలిపారు.
భారీగా మహిళా పోలీసుల భర్తీ
Published Sun, Jun 29 2014 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement