దేశ వ్యాప్తంగా హంగామా సృష్టించిన రాష్ట్ర విధానసభ ఎన్నికలు శనివారం ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ విశ్రాంతి సమయాన్ని
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హంగామా సృష్టించిన రాష్ట్ర విధానసభ ఎన్నికలు శనివారం ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో, పెంపుడు జంతువులతో గడపగా, మరి కొంతమంది తమ నియోజకవర్గ ప్రజలతో సమావేశమయ్యారు.
ప్రశాంతంగా గడుపుతున్నా: శర్మిష్టా ముఖర్జీ
‘ఎన్నికల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదు. ప్రస్తుతం నా ఆలోచనల్లో ఆ అంశానిది చివరి స్థానం. నా విశ్రాంత సమయాన్ని పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నా. అంతేగాక నా ఇల్లు మొత్తం ఎన్నికల హడావుడితో చిందరవందరగా తయారైంది. దానిని శుభ్రం చేసి మళ్లీ పూర్వ స్థాయిని తీసుకురావాలి. సాయంత్ర సమయంలో నా తల్లిదండ్రుల వద్దకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కొంతసేపు గడిపి వస్తున్నా. నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చా. ప్రస్తుతం నా భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది’అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శర్మిష్టా ముఖర్జీ పేర్కొన్నారు.
ప్రచార విశేషాలకు పుస్తక రూపం: నూపుర్ శర్మ
‘మా నాన్న ఈ రోజు జర్మనీ వెళుతున్నారు. ఆ తర్వాత నాకు విశ్రాంతి లభిస్తుందేమో! మాది ఉమ్మడి కుటుంబం, వారి మధ్యలో ఉండటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. నాకు రాయడం ఇష్టం, అందుకే ప్రచార విశేషాలను రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకోలేదు. అయినా ఎన్నికల ఫలితాల గురించి నేను ఆతృతగా లేను. నా ఆధీనంలో లేని దాని గురించి నేనెందుకు బాధపడాలి. నేను ఒక ఆశయంతో బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను. గత ఏడేళ్లలో కొంత వరకు నా బాధ్యతను నెరవేర్చాను. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మదలచుకోలేదు, ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం’అని బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మ పేర్కొన్నారు. ఈ 29 ఏళ్ల రాజకీయ నాయకురాలు తన విశ్రాంత సమయాన్ని కూడా కార్యకర్తలకే కేటాయించారు. పోలింగ్ తర్వాతి పరిణామాలపై వారితో చర్చించారు.
చాలినంత నిద్ర పోయా: రాఖీ బిర్లా
‘ఇన్ని రోజులు ప్రచారంలో తీరిక లేకుండా గడపడం వల్ల చాలినంత నిద్రను కోల్పోయాను. దీంతో నేను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేచాను. ఫలితాల గురించి ఆతృతగా లేను. ఇవి ప్రజల ఎన్నికలు, చాలా మంది పోటీ పడితే అందులోంచి వాళ్లు ఒకరిని మాత్రమే గెలిపిస్తారు. అందువల్ల నేను బాధపడాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను నా నియోజకవర్గ మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ గడుపుతున్నాను’ అని మంగోల్‌పురి నియోజకవర్గ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లా తెలిపారు.