ఆవరణలు అద్దెకి..! | Delhi University to Rent Out Premises to Generate Resources | Sakshi
Sakshi News home page

ఆవరణలు అద్దెకి..!

Published Sun, Aug 17 2014 10:10 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

Delhi University to Rent Out Premises to Generate Resources

నిర్వహణకు అవసరమైన వనరులపై ఢిల్లీ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇందులోభాగంగా తన పరిధిలో పనిచేస్తున్న కళాశాలలు, ఎన్జీఓలతోపాటు ఇతర సంస్థలకు మౌలిక వసతులను కిరాయి ప్రాతిపదికన ఇవ్వనుంది. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
 
 న్యూఢిల్లీ: మౌలిక వసతుల నిర్వహణ నానాటికీ పెరిగిపోతుండడంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వనరుల అన్వేషణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2010 నాటి కామన్‌వెల్త్ క్రీడల సమయంలో నిర్మించిన రెండు స్టేడియంలతోపాటు తన ప్రాంగణంలోని కొన్ని మౌలిక వసతులను అద్దెకు ఇవ్వనుంది. అయితే వీటి లో వాణిజ్యేతర అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధనను విధించనుంది.ఈ విషయాన్ని డీయూ మీడియా సమన్వయకర్త, విద్యార్థి సంక్షేమ సంఘం జాయింట్ డీన్ మలయ్ నీరవ్ వెల్లడించారు.
 
 ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అవసరమైన నిధులను సమీకరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచనకు తెర తీశామన్నారు. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సమావేశంలో పైవిధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. రగ్బీ స్టేడియం, పోలో మైదానం, కాన్ఫరెన్స్ సెంటర్, అకడమిక్ రీసెర్చి సెంటర్, యాక్టివిటీ సెంటర్, శంకర్‌లాల్ కన్సర్ట్ హాల్, ఠాగూర్ హాల్ తదితరాలను అడిగినవారికి అద్దె ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. ఒకవేళ డీయూ అనుబంధ కళాశాలలే తీసుకుంటే కూడా ఎందుకు అద్దె చెల్లించాలని ప్రశ్నించగా ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలకు అవసరమైన వసతులు ఆయా కళాశాలల్లో ఉన్నాయని,
 
 అయితే భారీఎత్తున ఏదైనా కార్యక్రమం నిర్వహించదలుచుకున్నప్పుడు ఇటువంటి వసతులను వినియోగించుకోవచ్చని, ఎయిర్ కండిషన్, దీపాలు తదితరాలను వాటిని వినియోగించుకున్నందుకుగాను వారు కొంతమొత్తాన్ని నిర్వహణ వ్యయం కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ. 100 కోట్లు వెచ్చించి కామన్‌వెల్త్ క్రీడల సమయంలో పునర్‌నిర్మించిన పోలో మైదానాన్ని ఎవరైనా కిరాయి ప్రాతిపదికన తీసుకుంటే అందుకుగాను రోజుకు రూ. పదివేల నుంచి రూ. 3 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
 వీటిని కిరాయికి తీసుకునేందుకు ఎస్టేట్ డిప్యూటీ రిజిస్ట్రార్ నుంచిఅనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. అయితే ఇతరులు మాత్రం రిజిస్ట్రార్ వద్ద ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్టేడియాలను కిరాయికి తీసుకునే ముందు ఆయా సంస్థలు డీయూ క్రీడామండలి చైర్మన్ వద్ద నుంచి సిఫారసు లేఖను పొందాల్సి ఉంటుందన్నారు. డీయూలోని కాన్ఫరెన్స్ సెంటర్‌ను ఒక్కరోజు కిరాయికి తీసుకోవాలంటే అందుకోసం రూ. మూడు వేలనుంచి రూ. 30 వేలదాకా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంగణంలోని కమ్యూనిటీ సెంటర్ నుకూడా కిరాయి ప్రాతిపదికన పొందవచ్చన్నారు. వీటి ని వివాహాలు, విందులు తదితర కుటుంబ కార్యక్రమాలకోసం వినియోగించుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement