సాక్షి, ముంబై: పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపాలని ముంబై తెలంగాణ సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది.సీమాంద్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి... మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబుల కుట్రల ఫలితంగా పోలవరంపై ఆర్డినెన్సును రూపొందించారని ఆరోపించింది. వివిధ తెలంగాణ సంఘాల మద్దతుతో తూర్పు దాదర్‌లోని అంబేద్కర్ భవనం ఎదురుగాగల శ్రామిక హాలులో మధ్యాహ్నం 2.00 గంటలకు వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డినెన్సును తిప్పి పంపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం హాలులో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముంబై రిలయన్స్ ఎనర్జీ కార్మిక సమాఖ్య నాయకుడు పొట్ట వెంకటేశ్, మహారాష్ట్ర తెలంగాణ మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేశ్, వేదిక నాయకులు అక్కనపెల్లి దుర్గేశ్, మల్లేశ్, శ్రమజీవి సంఘం నాయకులు బాబుశంకర్, ఎడ్ల సత్తయ్య, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలోని(భద్రాచలం) 7 మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పొట్ట వెంకటేశ్ అభివర్ణించారు.
ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన జలవనరులు, అటవీ సంపదలే కాకుండా ఆదివాసుల జీవితాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని దుర్గేశ్ పేర్కొన్నారు. వెంకటేశ్ జి. మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణకు సీమాంధ్రుల కుట్రలు ఎంత ప్రమాదకరమో మొదటి ఆర్డినెన్సు ద్వారా రుచి చూపింరని, దీనిని వ్యతిరేకించాలని కోరారు. రచయిత మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీ, వెంకయ్య, చంద్రబాబుల కుట్రల ఫలితంగానే పోలవరం ఆర్డినెన్సును కేంద్రం రాష్ట్రపతికి పంపించే ధైర్యం చేసిందని, దీనితో వారి తెలంగాణ వ్యతిరేక స్వభావాలు బయట పడ్డాయని, ఇక రాబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు, మేధావులు, కవులు, ప్రజలు మరింత చైతన్యవంతమై ఎదుర్కొంటే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదన్నారు. ఇదిలాఉండగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైలోని తెలంగాణ ప్రజా, కులసంఘాలు ఘనంగా జరుపుకోవాలని వేదిక నాయకులు బాబూ శంకర్, పొట్ట వెంకటేశ్, ఎడ్ల సత్తయ్య, శ్రీను, మల్లేశ్ తదితరులు కోరారు.
పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపండి..!
Published Thu, May 29 2014 10:38 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement