అన్నింటా విఫలం
మోదీ ది యూ టర్న్ ప్రభుత్వం
ఎన్నికల హామీలు నెరవేర్చని కేంద్రం
ఊసేలేని నల్లధనం వెలికితీత
దిగ్విజయ్ సింగ్
బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఏన్‌డీఏ ప్రభుత్వాన్ని యూ టర్న్ ప్రభుత్వంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చే విషయంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.3లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్పిన మోదీ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఆధార్’ను నరేంద్రమోదీనే స్వయంగా విమర్శించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ ‘ఆధార్’ బీజేపీ గొప్పతనమేనని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారరన్నారు. అంతేకాకుండ కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌తో ముడి పెడుతున్నారని విమర్శించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్‌డీఏ ప్రభుత్వ తమ వాఖ్యలను, సిద్ధాంతాల పట్ల యూ టర్న్ తీసుకుంటోందన్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ ముద్రించిన పుస్తకాన్ని త్వరలోనే ప్రజలకు పంచబోతున్నామని తెలిపారు.
మధ్యతరగతి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ వైపుగా ఇప్పటివరకూ చేపట్టిన చర్యులు ఏంటని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గుతున్నా ఆమేరకు దేశంలో ఇంధన ధరలు తగ్గించకోవడం సరికాదన్నారు. దీని వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ ఆద్మీ పార్టీను బీజేపీ-బీ టీంగా అభివర్ణించారు. అసలు ఆ పార్టీకు ఒక రాజకీయ సిద్దాంతమే లేదని విమర్శించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక రోజులోపే కిరణ్‌బేడీను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం వల్ల ఆ పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన హర్షవర్థన్ వంటి నాయకులకు అన్యాయం జరిగిందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.