
కాలుష్య పరిశ్రమ వద్దంటూ సభలో విలపిస్తూ చెబుతున్న తాడిపర్తి అమ్మాజీ
వైఎస్ జగన్ వద్ద దివీస్ బాధితుల ఆవేదన
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘మంచినీరు ఇస్తున్నట్టు మభ్యపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటామంటున్నారు. 85 రోజులుగా పోలీసులతో మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు సర్వనాశనమవుతాయి. పొలాలు తీసుకుంటే మేమెక్కడి పోవాలి. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ పెట్టనీయం. మీ అండ మాకు కావాలి’’ అంటూ దివీస్ ప్రతిపాదిత గ్రామ ప్రజలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్ద తమ కష్ట, నష్టాలు చెప్పుకొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ ప్రతిపాదిత గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన విచ్చేశారు. ఈ సభలో బాధితులు తమ ఇబ్బందులను వైఎస్ జగన్‌కు ఇలా వివరించారు.
మంచినీరు కుళాయిలు పెట్టి మభ్యపెట్టారు
ఈ మండలంలో 50 గ్రామాలు ఫ్యాక్టరీకి అతి దగ్గరలోనే ఉన్నాయి. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. ఎన్టీఆర్ పేరుమీద మంచినీటి కుళాయిలు పెట్టి... ఆ తర్వాత ఫ్యాక్టరీ బోర్డులు పెట్టాక తెలిసింది. ఎండాకాలంలో కూడా ఇక్కడ తీరంలో మంచి వాతావరణం ఉంటుంది. ఇదంతా పాడవుతుందని ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే మాపై కేసులు పెట్టారు. పిఠాపురం సీఐ ఆడపిల్లలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.
– మట్ల ముసలయ్య, రైతు, పంపాదిపేట
ప్రాణాలు పోయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటాం
దివీస్‌కు వ్యతిరేకంగా 82 రోజులుగా పోరాడుతున్నాం. 144 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారండి. మాకు ఎమ్మెల్యేగారు అండగా ఉన్నారు. వామపక్షాల వాళ్లు, ఐద్వా వాళ్లు మాకు మద్దతుగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారండి. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటారంట. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుంటాం.
– మంగులూరి సుశీల, కొత్తపాకల
మహిళలపై కేసులు పెట్టి వేధిస్తున్నారండి
మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా పొలాలు లాగేసుకున్నారండి. ఎకరానికి ఐదు లక్షలిస్తామంటున్నారండి. ఐదు లక్షలతో మా పిల్లల్ని ఎలా పెంచాలండి? ఫ్యాక్టరీ వల్ల మా సంతానానికి సంతానం పుట్టరండి. పొలం, డబ్బు లేకపోతే మళ్లీ సంపాయించుకోవచ్చు. సంతానం లేకపోతే ఎలా తెచ్చుకోగలమండి? మాకు ఏమీ వద్దండి. మా సంతతి సంతతిని కాపాడాలని కోరుతున్నామండి.
– అంజాలపు రామకృష్ణవేణి, పంపాదిపేట
ఎన్నికల ముందు ఏరువాక చేసి భూములిస్తామన్నడు
నేను ఎకరం రైతునన్న. ఎన్నికల ముందు చంద్రబాబు ఇక్కడే ఏరువాక చేసి, మీ భూమి మీకిచ్చేస్తామన్నారు. ఎకరం రూ. 50 లక్షల విలువ చేసే భూములు వైఎస్ మూడు లక్షలకే తీసుకెళ్లి వాళ్ల కొడుకుకు కట్టబెడుతున్నారంటూ అబద్ధాలు చెప్పి ఎన్నికల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు వచ్చి మా పొలాలు లాగేసుకుంటున్నాడన్నా. పొద్దున సుప్రభాతం బదులు పోలీసుల సైర¯ŒS వింటున్నామన్నా. మాకు దీని నుంచి విముక్తి కల్పించన్నా.
– బుచ్చిబాబు, పంపాదిపేట
యనమల పట్టించుకోవడంలేదు
నేను హెచరీస్ ఉద్యోగిని సారు. ఏడో తరగతి చదివాను. నెలకు ఎనిమిదివేలు జీతం వస్తుంది సారు. అక్షరం ముక్కలేని వాడుకు కూడా 20 వేలు కూడా వస్తుంది సారు. ప్రతి హెచరీలో 100 మంది పని చేస్తారు. నాకు ఎకరం పొలం ఉంది. 144 సెక్షన్ పెట్టడంతో చాలా దారుణంగా ఉంది సారు. ఇక్కడ 30 ఏళ్లు పాలించిన యనమల రామకృష్ణుడు మేము ఎలా ఉన్నామో కూడా చూడలేదు.
– యనమల శ్రీను, తాటాకుల పాలెం
ఇదంతా యనమల చేయించారండి
కనీసం మాట్లాడుకోనీయకుండా పోలీసులు వేధిస్తున్నారండి. బయటూరోళ్లను తీసుకొచ్చి మీటింగ్‌లు పెట్టి వారితో ఫ్యాక్టరీ కావాలని చెప్పించారండి. ఇదంతా యనమల రామకృష్ణుడు చేయించారండి. ఓ రోజు పోలీసులు వచ్చి నువ్వు సీఐ మీద తిరగబడ్డావంటూ జాకెట్ చించేసి జీపు దగ్గరకు తీసుకెళ్లారండి. నన్ను, మా ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారండి.
– బండ్లి మంగ, కొత్తపాకల
భూములు తీసుకుని చెక్కులు వేస్తామంటున్నారండి
ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నట్లు తెలపకుండానే మా భూములు తీసుకుంటామని, చెక్కులు మా అకౌంట్లో వేస్తామని కలెక్టర్‌గారు చెబుతున్నారండి. తుని సీఐ ఓ రౌడీలా ప్రవర్తిస్తున్నారండి. మాకు గాయాలైతే ఎమ్మెల్యే రాజా గారు అన్నవరం ఆస్పత్రిలో కట్లు కట్టిస్తుంటే యనమల కృష్ణుడు గుండాలతో కొట్టించాడండి. మా అమ్మకు చేయి విరిగింది.
– అంగులూరి శ్రీను, కొత్తపాకల
పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారు
దివీస్‌కు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాడుతుంటే అధికారపార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి సహాయంతో పోరాటం చేస్తున్నాం. కలెక్టర్‌గారు దారుణంగా వ్యవహరిస్తున్నారండి. మేము వినతిపత్రం ఇస్తే ఫ్యాక్టరీ నిర్మించడానికి వారికి అనుమతి ఇచ్చేశామని చెబుతున్నారు.
-అరుణ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ